హిమ్మత్‌వాలా సినిమాలోని దృశ్యం
‘హిమ్మత్‌వాలా’ సినిమా.. అందులోని.. ‘నయినోం మే సప్నా.. సప్నోం మే సజ్‌నా’ పాట ఎంతగా హిట్టయ్యాయో సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తమన్నా- అజయ్ దేవగణ్ జంటగా ఈ సినిమాను మరోసారి రీమేక్ చేశారు కూడా. ‘ఊరికి మొనగాడు’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే సినీ అభిమానుల గుండెల్లో కొలువైన అందాల నటి శ్రీదేవి మాత్రం.. హిమ్మత్‌వాలా సినిమా హిట్టవ్వడాన్ని తన దురదృష్టంగా భావించారట. తనకు తొలి విజయాన్ని అందించిన సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా కావడంతో ఆమె కాస్త నిరాశ చెందారట. ఈ విషయాన్ని ‘శ్రీదేవి : క్వీన్ ఆఫ్ హర్ట్స్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీదేవి ‘సోల్వా సావన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో నాలుగేళ్ల పాటు బాలీవుడ్‌కు దూరమయ్యారు.
ఆ తర్వాత 1983లో శ్రీదేవి- జితేంద్ర జంటగా తెరకెక్కిన హిమ్మత్‌వాలా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ సినిమాతో శ్రీదేవి గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందారు. అయితే కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కావాలని ఆమె అనుకోలేదట. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘ తమిళ ప్రేక్షకులు నా సహజ నటనను ఇష్టపడతారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకుల అబిరుచి వేరు. సద్మా(వసంత కోకిల రీమేక్) ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నన్ను గ్లామరస్ పాత్రల్లో చూడాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హిమ్మత్‌వాలా సక్సెస్‌ను నా దురదృష్టంగా భావిస్తా. కానీ ఏదో ఒకరోజు నాలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుందని ఆమె అన్నట్లు ‘శ్రీదేవి’ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా హిందీలో శ్రీదేవి తొలి హిట్ హిమ్మత్‌వాలా 35వ వార్షికోత్సవానికి ఒకరోజు ముందుగానే ఆమె మరణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment