లైంగిక వేధింపులపై ఉద్యమంలా ప్రారంభమైన ‘మీటూ’.. స్త్రీల పట్ల పురుష వైఖరిలో మార్పుకి కారణమైందా? పురుషులు జాగ్రత్త పడేలా చేసిందా? అంటే దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతి ఇద్దరిలో ఒకరు అవునని చెప్పగా.. తాము తోటి మహిళా ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు అంగీకరించారు. విధులు నిర్వహించిన ప్రాంతాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సినీ, మీడియా రంగ ప్రముఖులు పలువురు ఇటీవల ‘మీటూ’ ఆన్‌లైన్ ఉద్యమం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే పురుషుల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? అని ‘యు గవ్ ఇండియా’ అనే సంస్థ ఈ నెల 16 నుంచి 22 వరకు ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది స్త్రీ, పురుషుల నుంచి 21 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. వీరిలో పురుషులు 51 శాతం కాగా, మహిళలు 49 శాతం మంది.
సర్వేలో తేలిన ప్రధానాంశాలు..
► ‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు తాము స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నామన్నారు. మీటూ భయంతో సహోద్యోగులైన స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కేవలం పనికి సంబంధించిన విషయాలకు మాత్రమే పరిమితమవుతున్నామంటూ ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు అంగీకరించారు. అదేవిధంగా పురుషుల్లో మూడోవంతు మంది కార్యాలయాల్లో తమ టీంలోకి మహిళలను తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే ‘మీటూ’ ఉద్యమానికి కొంత మంది సానుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీల ఉద్యోగ జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా తలెత్తుతున్నట్టు సర్వే తేల్చింది.
► పట్టణాల్లో నివసించేవారిలో 76 శాతం మంది లైంగిక వేధింపులను తీవ్రమైన సమస్యగా భావిస్తున్నారు. మహిళల్లో అత్యధికంగా 87 శాతం మంది లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలపగా, పురుషుల్లో 66 శాతం మంది మాత్రమే ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యువతరం (18–39 ఏళ్ల వారు) లైంగిక వేధింపులను తీవ్రమైందిగా భావిస్తుండగా 40 ఏళ్ల వయస్సు వారు మాత్రం అంత తీవ్రమైన సమస్యగా అనుకోవడం లేదు. యువతరంలో 83 శాతం మంది ‘మీటూ’ని సీరియస్‌గా భావిస్తుండగా, 40 ఏళ్ల వారిలో 63 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.
► సర్వేలో ఎక్కువ మంది తమ అంగీకారం లేకుండా తాకడం, అసభ్య చిత్రాలూ, మెసేజ్‌లూ పంపించడం లైంగిక వేధింపుగానే భావిస్తామన్నారు.
► బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు ఎక్కువ. ఆ తరువాతి స్థానం రాజకీయాలదే.
► దాదాపు 43 శాతం మంది తమకు లైంగిక వేధింపుల బాధితులెవరో తెలుసునని పేర్కొనగా, 36 శాతం మంది నిందితులెవరో తెలుసుని చెప్పారు.
‘మీ టూ’తో పురుషుల్లో మార్పు!
Published Sat, Oct 27 2018 4:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment