‘గొప్పలకు పోకండి, వసతులు కల్పించండి’
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడేందుకు వచ్చిన వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంపచోడవరంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పెంచిన మెస్ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని జగన్ కు విద్యార్థులు తెలిపారు. పిల్లలకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై జననేత అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్వచ్ఛ భారత్, బహిరంగ మల విసర్జన లేని వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, వసతులు కల్పించాలని మండిపడ్డారు. 750 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు సిబ్బందే ఉన్నారని, ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు పెరగలేదని తెలుసుకుని ఆవేదన చెందారు. తమ ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీయిచ్చారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయకుండా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును సీఎం చంద్రబాబు హరిస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయడం లేదని జగన్ ఆరోపించారు.