ఆ పాము గర్భిణి.. మాకొద్దు!
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో దొరికిన తాచుపామును తాము సాకలేమని విశాఖ జూ అధికారులు చేతులెత్తేశారు. 15 అడుగుల తాచుపాము ఒకదాన్ని రంపచోడవరం ప్రాంతంలో ఈనెల 13వ తేదీన పట్టుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించి పట్టుకున్న ఆ పామును అటవీ శాఖాధికారులు కష్టమ్మీద విశాఖపట్నం జూకు తరలించారు. అయితే, అక్కడ దాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆ పాము గర్భిణి అని గుర్తించారు. ఇది చాలా ఎక్కువ సంఖ్యలో పిల్లలను పెట్టే అవకాశం ఉందని, అవి జూలో ఉన్న ఇతర జంతువులకు ప్రమాదకరం కావచ్చని, దాంతోపాటు ఈ పాము, పిల్లలను సాకడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుందని వైద్యులు చెప్పారు.
దీంతో అత్యంత విషపూరితమైన ఈ పామును విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీల మధ్యలో ఉన్న దట్టమైన అడవుల్లో లోపలికంటే తీసుకెళ్లి వదిలేశారు. రంపచోడవరం ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలో్కి ఈ తాచుపాము దూరగా, అత్యంత కష్టమ్మీద దీన్ని పట్టుకోగలిగారు. సాధారణంగా ఇంత పెద్ద తాచులు ఆస్ట్రేలియాలో కనపడతాయని, బహుశా చెట్లు నరికేయడం వల్ల ఇది నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత విషపూరితమైనది తాచుపామే.