
వర్గీకరణతోనే దళితుల ఐక్యత సాధ్యం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళితులు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితుల ఐక్యత కేవలం వర్గీకరణతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ దేశంలో అగ్రకులాల పెత్తందారులు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారని, వారి వాదనలో హేతుబద్దత లేదని విమర్శించారు.
కాగా, ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సురవరం లేఖ రాశారు. ఆందోళనలో మాదిగ జర్నలిస్టులు ‘కలం కవాతు’ చేశారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరం జాతీయ సలహాదారు దయాసాగర్ మాట్లాడుతూ వర్గీకరణ సాధించుకొనే వరకు మందకృష్ణ వెనకే ఉంటామని చెప్పారు.