దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజధానిలో దళితులు, బీసీలు ఉండటానికి వీల్లేదని, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్న టీడీపీనే.. ప్రస్తుతం అమరావతిలో దళితుల మధ్య విభేదాలను రాజేస్తూ మరో కుట్రకు తెరతీసింది. వెలగపూడిలో టీడీపీ కుట్రతో జరిగిన ఘర్షణలో ఓ దళిత మహిళ చనిపోయిన ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారు.
దళితులు ఐక్యంగా ఉంటే టీడీపీకి నష్టమని..
► దళితులు ఐక్యంగా ఉంటూ రాష్ట్రంలో రాజకీయంగా బలీయ శక్తిగా ఉండటాన్ని ప్రతిపక్షత నేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో దళితులు సమష్టిగా దాదాపు 18 శాతం ఓట్లు కలిగి ఉన్నారు. ఇంత పెద్ద ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీకి సంప్రదాయంగా బలమైన మద్దతుదారుగా ఉంది.
► 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అఖండ విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. దళితులు ఐక్యంగా ఉంటే మునుముందు తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని చంద్రబాబుకు బోధపడింది. అందుకే దళితులను విభజించేందుకు చంద్రబాబు కుట్రకు తెర తీశారు.
వెలగపూడిలో టీడీపీ దిగజారుడు రాజకీయం
► గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్య తలెత్తిన చిన్న వివాదాన్ని టీడీపీ కుట్రపూరితంగా రెచ్చగొట్టింది. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోశారు.
► ఆ గ్రామంలోని దళితవాడలో సిమెంట్ రోడ్డు.. ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను క్రిస్మస్ తర్వాత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీన్ని టీడీపీ సహించలేకపోయింది.
► ఈ అంశాన్ని ఘర్షణలకు దారితీసేంత తీవ్ర వివాదంగా మలచాలని టీడీపీ అధినాయకత్వం తమ పార్టీ నేతలకు స్పష్టం చేసింది. దాంతో టీడీపీకి చెందిన న్యాయవాది జడారి శ్రావణ్ కుమార్, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగి, ఆజ్యం పోసి రెచ్చగొట్టారు. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డాయి. ఎనిమిది మంది గాయపడగా, వారిలో మరియమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ
► తాము రాజేసిన చిచ్చుతో ఓ అమాయక దళిత మహిళ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. మరియమ్మ మృతదేహాంతో వెలగపూడిలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. హోంమంత్రి సుచరిత, తదితరులు గ్రామంలో పర్యటించి సర్ది చెప్పడంతో పోస్టుమార్టంకు మరియమ్మ కుటుంబ సభ్యులు సమ్మతించారు.
► అనంతరం అంత్యక్రియలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడుతుండగా టీడీపీ నేతలు వారిని ప్రభావితం చేసి ఆమె మృతదేహంతో సోమవారం తుళ్లూరు–వెలగపూడి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
► ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేశ్‌ను ఏ–1గా చేర్చాలని, ఎఫ్ఐఆర్ కాపీ తమకు చూపించాలని అసంబద్ధ డిమాండ్‌తో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఈ కేసును విచారించి ఎంపీ నందిగాం సురేశ్ పాత్ర ఉన్నట్టు తేలితే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.
► కానీ టీడీపీ నేత జడారి శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు మాత్రం అందుకు సమ్మతించకుండా ధర్నా కొనసాగిస్తుండటం టీడీపీ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది.
► శవపేటికలో పెట్టిన మరియమ్మ మృతదేహాన్ని వెలగపూడి–తుళ్లూరు రోడ్డులో దించి మరీ టీడీపీ ధర్నా కొనసాగిస్తుండటం బాధాకరమని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మధ్యలో మృతదేహాన్ని దించరాదని చెబుతున్నారు.
తొలి నుంచీ బాబు దళిత వ్యతిరేకి
► చంద్రబాబు ఆది నుంచి దళితుల పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. 1995–2004లో, 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తీరు మారలేదు. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే.
► అమరావతిలో దళితుల ఎసైన్ట్ భూములను తన బినామీల పేరిట తక్కువ ధరకు కొల్లగొట్టారు. అక్కడ దళితులను లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఇది గ్రహించే దళితులతో సహా అన్ని వర్గాల వారు అమరావతి పరిధిలోని మంగళగిరి (లోకేశ్ ఓడిపోయారు), తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినా బాబు మారలేదు.
► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. వీరిలో ఎక్కువ మంది దళితులు ఉండటంతో టీడీపీ కోర్టును ఆశ్రయించి అడ్డుకుంది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతిలో ‘సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది’ అని నిస్సిగ్గుగా వాదించింది.
తక్షణం స్పందించిన ప్రభుత్వం
► వెలగపూడిలో ఘర్షణలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలను నివారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగాం సురేశ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్‌రావు తదితరులు వెలగపూడిలో పర్యటించారు.
► మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. దళితులు అంతా ఒకటే కుటుంబమని చెప్పి అందరం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
► గాయపడిన వారికి పూర్తి చికిత్స అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వెలగపూడిలో రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
సాక్షి, గుంటూరు/తాడికొండ: వెలగపూడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు ప్రారంభంలో ఆర్చ్ ఏర్పాటు చేసి, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీగా నామకరణం చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే రోడ్డుకు ప్రారంభంలో ఉన్న గృహాల వారు (మరో వర్గం) దీన్ని వ్యతిరేకించడంతో నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. ఐదుగురిని తాడేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఇద్దరిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మను తొలుత గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. మరియమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు సోమవారం తుళ్లూరు – వెలగపూడి ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. వివాదం ముదరడానికి ఓ కారకుడైన తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం : హోం మంత్రి సుచరిత
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో అలజడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మరియమ్మ మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ఎస్సీలను విడగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. మహానేతలైన అంబేడ్కర్, జగ్జీవన్రామ్లను ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. తుళ్లూరు ప్రాంతంలో పోలీస్ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
అర్ధరాత్రి వెలగపూడి బయల్దేరిన హోం మంత్రి
తాము పేర్కొన్న వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ప్రతిని అందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీస్ అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిష్పక్షపాతంగా విచారణ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కేసులో చేర్చుతామని ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. అయినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఆందోళన విరమించలేదు. దీంతో హోం మంత్రి 11.30 గంటల ప్రాంతంలో వెలగపూడికి వెళ్లారు.