అమెరికా విధానాలతోనే ఇస్లామిక్ తీవ్రవాదం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
♦ అగ్రరాజ్యంతో మోదీ సర్కారు చెలిమి సరికాదు..
♦ పాక్‌తో చర్చల దిశగా కేంద్రం ప్రయత్నించాలి
సాక్షి, హైదరాబాద్: అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దశాబ్దాలుగా అంతర్యుద్ధాలు సాగుతున్న అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వంటి దేశాల్లో అమెరికా జోక్యంతోనే ఐఎస్‌ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు పాగావేసి విధ్వంసం సృష్టించే స్థితికి చేరుకున్నాయన్నారు. శుక్రవారం మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం మీడియాతో మాట్లాడుతూ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేసే పేరుతో పాశ్చాత్య దేశాలు చేస్తున్న దాడులు సామాన్యులను బలితీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించకుండా అమెరికాతో అంటకాగేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు.
పాకిస్తాన్ బేషరతుగా భారత్‌తో చర్చలకు ముందుకు వస్తున్నందున ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇప్పటికీ సాగుతున్నాయని, దీనిపై పోరాడేందుకు వామపక్ష పార్టీలన్నీ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు సురవరం తెలిపారు. సొంత ఖర్చుతో చండీయాగం చేసుకోవాలని చెప్పినందుకు సీఎం కేసీఆర్ బాధపడటం ఎందుకో తనకు అర్థం కాలేదని...ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ ఒక మతానికి సంబంధించిన పండుగలు, యాగాలు నిర్వహించడం లౌకిక విధానాలకు వ్యతిరేకమన్నారు. వామపక్ష పార్టీల మద్దతుతో ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వర్‌రావు పోటీ చేస్తున్నారని, నల్లగొండలో సీపీఎంకు తాము మద్దతిస్తున్నట్లు చాడ చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషా, రవీంద్ర కుమార్, నర్సింహ, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.