అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం
- ఉస్మానియా యూనివర్సిటీ సభలో వక్తలు
- దళితులపై దాడులు అమానుషం
- ఐక్యతతో కేసీఆర్ పాలనకు చమరగీతం పాడుదాం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనావిధానాలను ముందుకు తీసుకెళ్దామని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో తెలంగాణ తీన్‌మార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 125వ జయంతి జరిగింది. తీన్‌మార్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరంగల్ రవి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఓయూ అధ్యాపకులు ఇటిక్యాల పురుషోత్తం, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడారు.
ఇటీవల హత్యకు గురైనట్లు దళిత సంఘాలు పేర్కొంటున్న మంథని మధుకర్ ఆత్మకు శాంతి చేకూరాలని సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, కనీసం కేసులు కూడా నమోదు కాకపోవడం దారుణమని అన్నారు. అసమానతలను రూపుమాపేందుకు, దళితులు, మహిళల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు.
సీఎం కేసీఆర్ దళితులను మోసగించారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని టీఎస్‌పీఎస్సీకి కేంద్రం అవార్డు ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు. వర్సిటీలను అంతం చేసే యత్నంలో పాలకులు ఉన్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు చమరగీతం పాడాలంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులందరూ ఒకే గొడుగు కిందికి రావాలన్నారు.