‘హిసాబ్ దో, జవాబ్ దో’ పేరిట నిరసనలు
పెద్ద నోట్ల రద్దుపై వచ్చే నెల 3–10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళన: సురవరం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై సీపీఐ ఉద్యమబాట పట్టనుంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ జాతీయ సమితి నిర్ణయించింది. ‘‘హిసాబ్ దో, జవాబ్ దో’ (లెక్క చెప్పండి, సమాధానం ఇవ్వండి) నినాదంతో వచ్చే నెల 3 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ జాతీయసమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను శుక్రవారం ఇక్కడ పార్టీ సీనియర్ నాయ కులు గురుదాస్ దాస్‌గుప్తా, డి.రాజా, చాడ వెంకట్‌రెడ్డి తో కలసి ఆయన మీడియాకు వెల్లడించారు.
నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తన తప్పిదాన్ని అంగీకరించడంలేదని, ఈ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారంటూ బీజేపీ వివిధ సాధనాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. నిపుణులు, అనుభవజ్ఞులైన ఆర్థికవేత్తలను సంప్రదించ కుండా మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి ఘోరమైన ఈ నిర్ణయం వల్ల దేశం తీవ్రమైన పరిణామాలు చవిచూస్తోం దన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న 45 రోజుల్లో ఆర్‌బీఐ 60 నోటిఫికేషన్లు, వాటికి సవరణలను ఇవ్వడాన్ని బట్టి ప్రజలపై చూపే దుష్పరిణామాలను ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టమవుతోందన్నారు.
దళితులపై దాడులకు నిరసనగా ధర్నా
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలకు నిరసనగా వచ్చేనెల 22న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నా మని, వామపక్షాల అగ్రనాయకులు, ఆర్‌పీఐ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ర్యాలీలో పాల్గొంటారని సురవరం తెలిపారు. వచ్చే నెల 26న రాజ్యాంగ పరిరక్షణదినం, 30న ‘డిఫెండ్ సెక్యులరిజం’ చేపడుతున్నామన్నారు. సహారా పేపర్స్, అదిత్యా బిర్లా ముడుపులపై మోదీ దేశప్రజలకు సమాధా నం చెప్పాలని, దీనిపై విచారణకు ఆదేశించి తన నిర్దోషి త్వాన్ని నిరూపించుకోవాలన్నారు. ఆదిత్యాబిర్లా, సహారా సంస్థలపై చర్యలు తీసుకోకుండా ‘గోల్డెన్ సైలెన్స్’ పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నూతన విద్యావిధానం 2016ను ఉపసంహరించాలని, మహిళా స్వయం సహాయక బృందాల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, అమెరికాతో రక్షణ భాగస్వామిగా భారత్ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని పార్టీ తీర్మానించింది.