వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే: సీపీఐ నారాయణ
వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే: సీపీఐ నారాయణ
Published Thu, Feb 2 2017 12:17 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
పెద్దనోట్ల రద్దు, బడ్జెట్ తదితర అంశాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని విమర్శించారు. మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య లాంటి ఇద్దరు గొర్రెలు దొరికారని, నోట్లరద్దుపై 50 రోజులు ఓపిక పడితే ప్రజల జీవితాన్ని మార్చేస్తానంటే నమ్మారని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నల్లడబ్బు ఉన్నవారంతా తెల్లదొరలుగా మారారని ఎద్దేవా చేశారు. జంతర్ మంతర్ జైట్లీ బడ్జెట్ ఫెయిల్ అయిందని, ట్రంప్ ఏ చర్యలు తీసుకున్నా తామున్నామనే హామీని జైట్లీ తన బడ్జెట్‌లో ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆయన కేవలం హరికథా కాలక్షేపంతో బతికేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్డీయే రాజకీయంగా ఫెయిల్ కావడం వల్లే మతసామరస్యాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీకి తమిళులు జల్లికట్టు ఉద్యమంతో బుద్ధి చెప్పారని అన్నారు. యూపీలో ప్రస్తుతం బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అమరావతి రైతులకి క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేసినట్లే, పోలవరం రైతులకు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చేతనైతే పోరాడాలి, లేకుంటే ఊరుకోవాలని అన్నారు. ప్రజల్ని మోసం చేయడంలో వెంకయ్య, చంద్రబాబులను మించినవారు దేశంలో లేరని విమర్శించారు. ముందుగా బీజేపి నాయకుల ఆస్తులు, అకౌంట్లు ప్రకటించాలని, ఆ తర్వాత పార్టీల విరాళాల గురించి మాట్లాడాలని సూచించారు.
Advertisement