
‘విమోచన’ను ప్రభుత్వమే నిర్వహించాలి
విమోచన విజయోత్సవ సభలో సురవరం డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. నిజాం పాలన నుంచి విముక్తి కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారోత్సవాల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన తెలంగాణ విమోచనోద్యమ విజయోత్సవ సభ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా సాగినట్లుగా బీజేపీ చిత్రీకరిస్తోందని, చరిత్రను వక్రీకరించడం తగదని ఖండించారు. హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ పేదలు, రజాకార్ల చేతిలో ఇబ్బందులు పడ్డ పేద ముస్లింలు సైతం ఉద్యమించారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు రావి నారాయణరెడ్డి, మఖ్దుం మొహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వాన వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగిందన్నారు. సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మా ట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాటి పోరాటయోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలను పొగిడిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడడంలేదు.
నోరు పడిపోయిందా.., పక్షవాతం వచ్చిందా..?’ అం టూ ఘాటుగా ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల కాళ్ల కింద వందసార్లు ఈగినా కేసీఆర్ పాపం పోదని ధ్వజమెత్తారు. అంతకుముం దు ట్యాంక్‌బండ్‌పై మఖ్దూం మొహినుద్దీన్ విగ్రహానికి సీపీఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి ఇందిరాపార్కు వరకూ సీపీఐ ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుల చిత్రపటాలను ప్రదర్శన అగ్రభాగాన ఉంచారు. మహిళలు బతుకమ్మ, బోనాలతో పెద్దఎత్తున తరలివచ్చారు. కళాకారుల ఆటపాట ఆకట్టుకుంది. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ఆ పార్టీ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.