బంగ్లాల తెలంగాణ వచ్చింది
• కేసీఆర్ సీఎం అయ్యాక కూడా సంస్కారం నేర్చుకోలేదు
• సీపీఐ బహిరంగ సభలో సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, వరంగల్: రెండున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాదుగానీ.. బంగ్లాల తెలంగాణ వచ్చిందని భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వదిలి రూ. కోట్లు ఖర్చు చేసి అధికారిక నివాసాలు నిర్మిం చుకుంటున్నారని అన్నారు. వాస్తు పేరిట సచివాలయ భవనాలు, పండుగల కోసం రూ. కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభల ముగింపు సందర్భంగా బుధవారం హన్మకొండలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీ మైదానంలో బహిరంగసభ జరిగింది. సభలో సురవరం ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. వారికి నష్టపరిహారం ఇవ్వలేని స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో మరో నిజాం పాలన కొనసాగుతోందని, కేసీఆర్ ప్రజాస్వామిక ఫ్యూడల్ పరిపాలనను సాగిస్తున్నారని విమర్శించారు. ‘ప్రజలకు అందుబాటులో ఉండడు. ప్రతిపక్షాలు మాట్లాడితే తిట్టిపోస్తడు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అరుున తర్వాత కూడా కేసీఆర్ సంస్కారం నేర్చుకోలేదు. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ముందె న్నెడూ లేని విధంగా కేసీఆర్ అధికారం చెలారుుస్తున్నాడు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు టోపీ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నారుు’ అన్నారు.
ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమరూపంలో మార్చడానికి, పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీని శక్తివంతంగా నిర్మాణం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ అన్నారని సురవరం గుర్తు చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధ నం విషయంలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014లో దేశంలో రైతుల అనుకూల చట్టం పేరుతో, పెట్టుబడిదారులకు పనికొచ్చే భూసేకణ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కార్మిక వర్గాల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.