
పార్టీ కార్యాలయమా... మల్టీ ప్ల్లెక్సా
సాక్షి, చెన్నై: తమిళనాడు సీపీఐ కార్యాలయం మల్టీప్లెక్స్‌ను తలపించే రీతిలో నిర్మించారు. బహుళ అంతస్తులతో, అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని సోమవారం సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వామపక్షాలకు బలం ఉంది. ఒకప్పుడు వామపక్షాల హవా ఇక్కడ సాగింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీల బలం తగ్గుతోంది. అయితే బలం తగ్గినా, తమ సత్తా తమదే అన్నట్టుగా రెండు పక్షాలు ముందుకు దూసుకెళ్లున్నాయి. ఇటీవల అత్యాధునిక హం గులతో సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యాల యం చెన్నైలో రూపుదిద్దుకుంటే, తాజా గా సీపీఐ కార్యాలయం తామేమి తక్కు వ తిన్నామా..? అన్నట్టుగా నిర్మించుకున్నారు.
ఇది వరకు టీ నగర్‌లోని సెవాలియ శివాజీ గణేషన్ రోడ్డులో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉండేది. అది పాత బడడం, స్థలం చాలని దృష్ట్యా దాన్ని కూల్చేశారు. దాని స్థానంలో సుమారు రూ.15 కోట్ల మేరకు వెచ్చించి అత్యంత ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు. మల్టీ స్టోర్‌డ్ భవనంగా ఎనిమిది అంతస్తులతో పార్టీ కార్యాలయం రూపుదిద్దుకుంది. లోపల పార్టీ నాయకులకు గదులు, ఆడిటోరియం, సమావేశ మందిరం, గ్రంథాలయం, శిక్షణ తరగతుల కోసం ప్రత్యేక వసతుల్ని ఇందులో కల్పించి ఉండడం గమనార్హం. అత్యంత ఖరీదైన భవనంగా రూపుదిద్దుకున్న సీపీఐ రాష్ట్ర కార్యాలయం భవనం ప్రారంభోత్సవం ఉదయం జరిగింది.
ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో సీపీఐ కార్యదర్శి, ఎంపీడీ రాజా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి టీ పాండియన్, డీఎంకే తరపున మాజీ ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, బీజేపీ తరపున మహిళ నేత తమిళి సై సౌందరరాజన్, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే బలరాం హాజరయ్యారు. మీడియాతో రాజా మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ధోరణిలో పయనిస్తున్నదని విమర్శించారు. రైలు చార్జీలు, పెట్రోల్, డీజిల్ పెంపుతో గత ప్రభుత్వాన్ని తలపిస్తున్నదని ధ్వజమెత్తారు.