పార్లమెంటు అంటే ప్రధానికి భయమా?
• సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్న
• పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
• 28 నుంచి 30 దాకా సీపీఐ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో గురువారం జరిగింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషాలతో కలసి సురవరం విలేకరు లతో మాట్లాడారు. దేశంలోని 92 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ప్రధానమంత్రి యాప్ సర్వేలో 93 శాతం ప్రజలు నోట్ల రద్దుపై మోదీకి మద్దతు తెలిపినట్టు అసత్య ప్రచారం చేస్తు న్నారని మండి పడ్డారు.
చిన్న వ్యాపారులు, వృత్తి దారులు, పేదలు, కూలీలు కష్టాలు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుని ఛిన్నాభిన్నై మైందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిపు ణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో జీడీపీ వృద్ధి 3.5 శాతానికి తగ్గిపోతుందని సురవరం పేర్కొన్నారు. పాత కరెన్సీని కొంతకాలం చెలామణిలో పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నల్లధనం 6.5 శాతమే కరెన్సీ రూపంలో ఉందని, మిగిలిన దంతా బంగారం, భూమి రూపంలోకి మారి పోరుునట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తు న్నారన్నారు. ఇది నల్లకుబేరులపై సర్జికల్ దాడి కాదని, దేశంపై కార్పొరేట్ దాడి అన్నారు.
రెండు పార్టీల నల్లధనాన్ని నాశనం చేసేందుకే
ఉత్తరప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న నల్లధనాన్ని నాశనం చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని సురవరం ఆరోపించారు. ఎన్నికల్లో ఆదానీ, అంబానీల ఖర్చుతోనే మోదీ ప్రచారం చేశారని, ప్రతిఫలంగా వారికి రూ.70 వేల కోట్ల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో షైనింగ్ ఇండియా అంటూ తప్పుడు ప్రచారాలతో ఎన్డీయేను ముంచిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు కూడా మరోసారి దెబ్బతీయడానికి తప్పుదోవ పట్టిస్తున్నాడని హెచ్చరించారు. నోట్లరద్దుపై ఈ నెల 28న దేశంలోని అన్ని వామపక్షపార్టీలతో కలసి ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ఆందోళనలకు దిగుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త ఇంటిలో చేరిన తర్వాతనైనా వైఖరిలో మార్పురావాలని ఆకాంక్షించారు.