భయోత్పాతమే మోదీ సిద్ధాంతం
పేదలను కొట్టి పెద్దలకు పెట్టడానికే నోట్ల రద్దు
• నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
• నోట్ల రద్దు ప్రధానిని చూసి ప్రపంచం నవ్వుతోందని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని, అధికార బీజేపీ, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాడిని తీవ్రం చేశారు. ప్రజలను భయపెట్టడమే మోదీ సిద్ధాంతమని నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి తప్పిస్తామని, అప్పడే అసలైన మంచిరోజులు వస్తాయన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని టాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘జన వేదన సమ్మేళన్’ సమావేశానికి రాహుల్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మాది అభయహస్తం
‘కాంగ్రెస్ గుర్తు హస్తం. శివుడు, బుద్ధుడు, గురునానక్, హజ్రత్ అలీ.. ఇలా ఏ మహనీయుల చిత్రాల్లో చూసినా అది కనిపిస్తుంది. దీని విశేషమేంటని ఒక నేతను అడిగాను. ‘దాని అర్థం అభయ హస్తం.. భయపడొద్దు. నిజాయతీగా ఉండు’ అని చెప్పారు. గాంధీ, నెహ్రూల ఉత్తరాలను చూస్తే.. ఆంగ్లేయులను చూసి భయపడొద్దనే సారాంశం కనిపిస్తుంది. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధి హామీ, ఆహార భద్రత.. మరెన్నో అంశాల్లో పేదలకు అండగా ఉంటామనే భావన ఉంది. బీజేపీ భయోత్పాతంతో దేశాన్ని పాలించాలనుకుంటోంది. ఉగ్రవాదులకు, నోట్ల రద్దుకు, మావోయిస్టులకు భయపడండి అంటోంది.. ఉపాధి హామీ కూలీల పైసలను, రైతుల హక్కులను మోదీ లాక్కున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు. నోట్ల రద్దు లక్ష్యం కూడా ఇదే. ప్రజలారా.. భయపడొద్దు అన్నది మా సిద్ధాంతం, ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం బీజేపీ సిద్ధాంతం.
ఆర్‌బీఐ, ఈసీల అధికారాలకు దెబ్బ
నోట్ల రద్దు గురించి కేవలం ఒకరోజు ముందు మాత్రమే ఆర్‌బీఐ చెప్పారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలను దెబ్బతీస్తూ వాటిని హాస్యాస్పదం చేస్తున్నారు. మోదీ అంతా తానే చేశానని చెబుతున్నారు. యోగా గురించి ఊదరగొట్టే ఆయన కనీసం పద్మాసం కూడా వేయలేరు.. నల్ల ధన నిరోధానికే నోట్ల రద్దు అని చెప్పి తర్వాత నగదు లావాదేవీలకు ప్రోత్సాహం అని అన్నారు. దురుద్దేశపూర్వక నోట్ల రద్దుతో మోదీ ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. దేశ ప్రధాని నవ్వులపాలు కావడం ఇదే తొలిసారి. నోట్ల రద్దుతో చాలా అక్రమాలు జరిగాయి. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లి కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. పేదలను, నీతిమంతులను లైన్లలో నిలబెట్టి, అవినీతిపరులను బ్యాంకు వెనక నుంచి లోపలికి పంపారు. పేదల నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. వాటిని ధనవంతుల రుణాల మాఫీకి వాడతారు.
నోట్ల రద్దు మృతులకు సంతాపం
29 మంది నోట్ల రద్దు’ కష్టాల మృతులకు సంతాపం తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. కాగా, పెద్ద నోట్ట రద్దు వల్ల భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై నవంబర్8న కేబినెట్æ సమావేశమైనట్లు అసలు ఎలాంటి రికార్డులు లేవని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు.