మిలిటెంట్ పోరాటాలకు సిద్ధంకండి
పార్టీ శ్రేణులకు సీపీఐ
జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ఉద్బోధ
రాష్ట్రంలో పార్టీని బలమైన ప్రజాశక్తిగా తీర్చిదిద్దాలని పిలుపు
హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలమైన ప్రజాశక్తిగా ఆవిర్భవించేందుకు మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటాల ద్వారా పార్టీ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కలసి సీపీఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సావనీర్‌ను సురవరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన తెలంగాణలో బద్దం ఎల్లారెడ్డి నాయకత్వంలో పార్టీ తొలి మహాసభలు జరుపుకోగా తాజాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పార్టీ తొలి మహాసభలు జరుపుకుందన్నారు.
ఈ నెల 25 నుంచి భూపోరాటాలు: చాడ
ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలు చేపట్టనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాగించిన అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 20న పది వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని శనివారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆగస్టు తొలి వారంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఇటీవల చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదనంగా రూ.10 వేల కోట్లు చెల్లించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.