సంఘ్ పరివార్ ఫాసిస్టు ధోరణులపై పోరాడాలి
- ఇందుకు బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలి
- రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో సురవరం పిలుపు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో సంఘ్ పరివార్ శక్తుల ఫాసిస్టు ధోరణులు, విధానాలపై పోరాడేందుకు శక్తిమంతమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను విద్యార్థిలోకం తిప్పి కొట్టాలన్నారు. శనివారం మఖ్దూం భవన్‌లో అఖిల భారత రాజకీయ పాఠశాల (సెంట్రల్ పార్టీ స్కూల్) తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారని విమర్శించారు.
ప్రజలు ఏం తినాలి, ఎటువంటి బట్టలను ధరించాలి, ఏం చదవాలి, టీచర్లు ఏం చెప్పాలి వంటి వాటిని ఆరెస్సెస్ నిర్ణయిస్తోందన్నారు. దేశంలోని వివిధ రంగాల్లోకి కాలం చెల్లిన పాత పద్ధతులు, హిందూ మతతత్వ, ఫాసిస్టు ధోరణులను అమలు చేయడం ప్రారంభించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలను, అశాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల 14 గ్రామాల్లోని 16 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా ఎకరానికి రూ.8 లక్షల చొప్పున పరిహారమిచ్చి చేతులు దులుపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర భూసేకరణచ ట్టం, 2013 ప్రకారం పేదలు, ఇతరవర్గాల వారికి పరిహార ప్యాకేజీ ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. అందరూ ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని, విద్యార్థులు విద్యతో పాటు సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చాడ వెంకటరెడ్డి స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు 1 వ తేదీ వరకు కొనసాగే ఈ రాజకీయ తరగతులకు సెంట్రల్ పార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ రాజన్‌వాలా అధ్యక్షత వహించగా.. సీఆర్ భక్షి, కృష్ణఝా తదితరులు పాల్గొన్నారు.