మీ గొంతు కాకుంటే విచారణకు సిద్ధపడండి
‘ఓటుకు కోట్లు’ కేసులో మాట్లాడారా? లేదా?
చంద్రబాబుపై సురవరం ధ్వజం
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అసలు విషయం చెప్పి తన నిజాయతీ చాటుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా సంబంధం లేని వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదన్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో వినిపించిన గొంతు ఆయనది(చంద్రబాబు) అనే ఆరోపణలు వచ్చాయి. అది తనదో కాదో నిజం చెప్పాలి. లేదంటే విచారణకు సిద్ధపడాలి. అంతేతప్ప లేనిపోని మాటలు మాట్లాడితే ఎలా? ప్రజల్ని మూర్ఖులనుకుంటున్నారా? సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడారో లేదో చెప్పండి. దాని గురించి అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు. అంటే దానర్థం దొంగతనం చేశారనుకోవాలా..’’ అని నిలదీశారు. సురవరం గురువారం పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే సెక్షన్-8 అంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పెద్దమనిషి తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరో కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు రాష్ట్రానికో నీతి ఉండదని పేర్కొన్నారు. స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా సాగదీయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణ ంపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని సురవరం స్వాగతించారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన చావులన్నీ హత్యలేనని అభిప్రాయపడ్డారు.