నోట్ల రద్దుకు ప్రజల మద్దతు: దత్తాత్రేయ
ఇటీవలి స్థానిక, ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు పెద్ద కుంభకోణమంటూ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. రద్దు తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి, ఎన్డీఏకి మద్దతు తెలపడం ద్వారా మోదీకి ప్రజలు అందించిన మద్దతు స్పష్టమవుతోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పనిగట్టుకుని అవినీతి కోణాన్ని చూపుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. లంచాలను తీసుకోవడంలో చిదంబరం పరిజ్ఞానాన్ని ప్రశ్నించ దలుచుకోలేదని.. ప్రతిభ గల న్యాయవాదిగా చిదంబరం రూ. 2వేలు లంచంగా ఎలా తీసుకోవచ్చో ప్రజలకు సలహాలు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. అయితే ప్రస్తుతమున్నది ఎన్డీఏ ప్రభుత్వమని గుర్తించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడితే పట్టుబడటం ఖాయమని చెప్పారు.