ఇది నల్లధన నిర్మూలన యజ్ఞం
► నోట్ల రద్దుపై మోదీ ట్వీట్
► తాత్కాలిక కష్టంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలుంటాయని, రైతులు, వర్తకులు, కార్మికులు లాభపడతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో మోదీ ట్విటర్‌లో స్పందించారు. కొన్ని రోజులు ఇబ్బందులు భరిస్తే భవిష్యత్తులో ఎన్నో లాభాలుంటాయని పేర్కొంటూ నోట్ల రద్దు ప్రయోజనాలపై గురువారం వరుస ట్వీట్స్ చేశారు. నగదు రహిత చెల్లింపుల దిశగా పెద్ద నోట్ల రద్దు చారిత్రక అవకాశంగా పేర్కొన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగిస్తుందని నేనెప్పుడూ చెబుతూనే ఉన్నా. అరుుతే దీర్ఘకాల ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బంది మార్గం సుగమం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా ఉన్న గ్రామీణ భారతీయు లు... అవినీతి, నల్లధనంతో ఎన్నో ఇబ్బందు లు పడ్డారు. అభివృద్ధిలో గ్రామాలు తమ వాటా అందుకోవాలి. ఈ నిర్ణయంతో రైతులు, వ్యాపారులు, కార్మికులు లాభపడతారు’ అని అన్నారు. ‘అవినీతి, ఉగ్రవాదం, నల్లధనంపై జరుగుతున్న ఈ యజ్ఞంలో హృదయపూర్వకంగా భాగస్వాములవుతున్న ప్రజలకు నా వంద నం’ అని మరో ట్వీట్ చేశారు. నల్లధనాన్ని భారత్ ఓడించింది అనేది నిజమయ్యేలా ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఇది పేదలు, మధ్యతరగతి సాధికారతకు సాయపడుతుందని చెప్పారు. యువతనుద్దేశించి ట్వీట్ చేస్తూ.. భారత్‌ను అవినీతి రహిత, నగదు రహిత కార్యకలాపాల దేశంగా మార్చేందుకు ప్రతినిధులుగా వ్యవహరించాలని సూచించారు.