చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే..
కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు.
‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్‌లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఇవాళ్టి కోర్టులో..
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment