న్యూఢిల్లీ, సాక్షి: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించిన ఆయన వేసిన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది కోర్టు. ఆ సమయంలో ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలా మాట్లాడడం ఏంటని? ప్రశ్నించింది.
తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలపై నమోదైన కేసులన్నింటిని(ఎఫ్‌ఐఆర్)లను ఒకే చోట విచారించేందుకు అనుమతించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. స్టాలిన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్.. ఉదయనిధి స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19(1)(a)ను(వాక్ స్వాతంత్ర్యం-భావ వ్యక్తీకరణ) మీరే అగౌరవపర్చుకున్నారు. అలాగే.. ఆర్టికల్ 25(మత స్వేచ్ఛా హక్కు)ను కూడా మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు.. మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32( తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం) ప్రకారం కోర్టును ఆశ్రయిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియందా?.. మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మందలించింది ధర్మాసనం.
ఎఫ్‌ఐఆర్‌లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి బెంచ్ సూచించింది. అయితే.. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పటికే ఆయా హైకోర్టులను ఆశ్రయించామని.. గతంలో ‘‘అమిష్ దేవగన్, అర్నాబ్ గోస్వామి, నుపూర్ శర్మ, మొహమ్మద్ జుబెర్’’ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరట ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను పరిశీలిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
ఏమన్నారంటే..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీలతో పోల్చిన జూనియర్ స్టాలిన్, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు రాజకీయంగా బీజేపీ.. ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే.. తనపై విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని.. సమాజంలో దుష్టశక్తులెన్నో పెరిగిపోవడానికి సనాతన ధర్మం ఒక కారణం అవుతోందనే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు.. న్యాయపరమైన పోరాటానికి తాను సిద్ధం అంటూ ప్రకటించారాయన.
Comments
Please login to add a commentAdd a comment