
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.
అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.