లక్నో: సనాతన ధర్మంపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. సనాతన ధర్మం శాశ్వతమైందని.. దానిని నిర్మూలించే దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. లక్నో పోలీస్ లైన్స్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావనను తీసుకురాకుండా పదునైన విమర్శలు గుప్పించారాయన.
‘‘మన సనాతన సంస్కృతిని చూపిస్తూ మన వారసత్వాన్ని అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావణుడి దురహంకారం.. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టలేకపోయింది. కంసుడి సవాల్‌తో సనాతన ధర్మం ఇంచు కూడా కదల్లేదు. బాబర్, ఔరంగజేబుల్లాంటి వాళ్ల దురాగతాలకు సనాతన ధర్మం చెక్కుచెదరలేదు. అలాంటిది.. రాజకీయ పరాన్నజీవులు పిలుపు ఇచ్చినంత మాత్రాన సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోతుందా? అంటూ సీఎం యోగి పేర్కొన్నారు.
ఇలాంటి రాజకీయ పరాన్నజీవులు.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నందుకు సిగ్గుపడాలి. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. సూర్యుడికేం కాదు. ఆ ఉమ్ము ఉమ్మినవాళ్ల ముఖం మీదే పడుతుంది అంటూ ఉదయనిధికి పరోక్ష చురకలంటించారు.
‘‘దేశం సరైన పురోగతిలో వెళ్తుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మక స్థానంలో నిలవడాన్ని తట్టకోలేకపోతున్నారు. అమృత్ కాల్‌లో.. భారతదేశం వేగంగా ప్రగతి సాధిస్తోంది. ప్రతిరోజూ కొత్త విజయాలు సాధిస్తోంది. దేశ పురోగతికి అడ్డుపడే క్రమంలోనే.. కొంతమంది మన సనాతన ధర్మంపై వేళ్లు చూపుతున్నారు’’ అంటూ సనాతన ధర్మంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నవాళ్లపై యోగి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment