కొన్ని మాటలు అంతే... కత్తి కన్నా పదును. కాలకూట విషం కన్నా ప్రమాదం. అందుకే కావచ్చు ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బా జాన్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. కన్న తండ్రిని ముస్లిమ్‌లు ప్రేమగా పిలుచుకొనే ‘అబ్బాజాన్’ అనే ఉర్దూ సంబోధనతో మైనారిటీలను ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు. మునుపటి ఏలుబడిలో మెజారిటీల ఉచిత రేషన్‌ను కూడా ‘అబ్బా జాన్’ అనేవాళ్ళే తినేశారంటూ యోగి ఆదివారం ఓ కార్యక్రమంలో అన్నారు. గత పాలనలో రేషనంతా నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలిపోయిందంటూ, పరోక్షంగా మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయమ్‌లపై నోరు చేసుకున్నారు. ఇక, మంగళవారం అలీగఢ్‌లో ప్రధానమంత్రి మోదీ ఏకపక్షంగా యోగీది ‘ఉత్తమ పాలన’ అని సమర్థించారు. మునుపటి మాఫియారాజ్యం యూపీలో ఇప్పుడు లేదంటూ ప్రతిపక్షాలపై తూటాలు పేల్చారు. ఈ తాజా సభలు, వ్యాఖ్యలతో వచ్చే మార్చిలో రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి బీజేపీ ముందే సమరశంఖం పూరించింది. మరోపక్క ‘ద్వేషాన్ని పెంచిపోషించేవారు యోగి ఎలా అవుతార’న్న రాహుల్ తదితరుల ప్రతిస్పందనలతో రాజకీయం వేడెక్కుతోంది.
గత సర్కారు మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు చేసిందనీ, తాము అలాంటివి చేయడం లేదన్నది బీజేపీ మాట. కానీ, ఇప్పుడీ అసంబద్ధమైన ‘అబ్బా జాన్’ ప్రస్తావనతో ఆ పార్టీ ఏ వర్గంపై విషం కక్కి, మరే వర్గాన్ని దగ్గరకు తీసుకొని, ఓటు బ్యాంకుగా ఏకీకృతం చేయాలనుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. యోగి హయాంలో యూపీలో విషాదకరమైన హాథ్రస్ అత్యాచార ఘటన జరిగి మంగళవారానికి సరిగ్గా ఏడాది. తొలి వార్షికోత్సవం నాడే ప్రధాని మోదీ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశంసల వర్షం కురిపించడాన్ని చూసి, విమర్శకులు నోరు నొక్కుకుంటున్నారు. అయితే, అఖిలేశ్ సారథ్యంలోని గడచిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పాలనలో కన్నా ఇప్పటి యోగి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయన్నది జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్క. ఒకప్పుడు రాష్ట్రంలో మాఫియా రాజ్యం నెలకొంటే, ఇప్పుడు నేరగాళ్ళకు జైలు భయం పట్టుకుందని బీజేపీ నేతలు అంటున్నదీ అందుకే. అలాగని యోగి పాలనలో అంతా అద్భుతమే అనుకుంటే పొరపాటే. రైతు సమస్యలు, నిరుద్యోగం, కరోనాలో కుప్పకూలిన ఆరోగ్యవ్యవస్థ లాంటి వైఫల్యాలూ అనేకం.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగమైన మిత్రపక్షాలు సైతం యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నాయి. మిత్రపక్షమైన జేడీయూ జాతీయ అధ్యక్షుడే ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న యోగి మరో అయిదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇలాంటి మతప్రమేయ వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా ఎన్నికల వ్యూహమే. మతప్రాతిపదికన ఓటర్లను చీల్చి, మెజారిటీ వర్గాన్ని మచ్చిక చేసుకొని ఒక తాటి మీదకు తేవాలనే యుద్ధతంత్రమని ఓ వాదన. ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్’ మాటల్లోనే తప్ప, మనుషులందరినీ కలుపుకొని పోవడంలో లేదనే విమర్శకు అది తావిస్తోంది. అయోధ్య, రామమందిరం, అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ జంక్షన్‌ను పండిట్ దీనదయాళ్ జంక్షన్‌గా పేర్ల మార్చిన బీజేపీ ముస్లిమ్ మరాఠా గవర్నర్ పేరు మీద వచ్చిన అలీగఢ్‌ను సైతం హరిగఢ్‌గా మార్చాలనే వాదనకూ ఊకొడుతుండడం విచిత్రం.
నిజానికి, 403 అసెంబ్లీ సీట్లు, 80 లోక్‌సభా స్థానాలే కాదు... ఇప్పటికే 23 కోట్ల జనాభా ఉన్న యూపీలో సమస్యలు చాలా ఉన్నాయి. కరోనా వేళ రాజకీయ నేతలు కేవలం ఓట్లు, సీట్ల మీదే కాక, ఆ సమస్యల పరిష్కారం మీదా దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది. మరోపక్క యోగి తప్పులను ఎండగట్టేందుకు కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు దేనికది వ్యూహరచన చేస్తున్నాయి. ఆ మధ్య దాకా అమ్మ సోనియా నిలబడే రాయ్‌బరేలీలో, అన్నయ్య రాహుల్ పోటీపడే అమేథీలో ప్రచారానికే పరిమితమైన ప్రియాంకా గాంధీని ఈసారి యూపీ ప్రచారక్షేత్రంలో ముందు నిలబెడుతోంది కాంగ్రెస్. ఇప్పటి అసెంబ్లీలో 7 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ అవసరమైతే సీఎం అభ్యర్థి ఎవరో ప్రియాంకే చెబుతారనీ అంటోంది. బీఎస్పీ రూటు మార్చి, వేదమంత్రాలు, శంఖనాదాలతో బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకోవడంపై దృష్టి పెట్టింది. బీజేపీ అయోధ్యతో పాటు అలీగఢ్‌లో జాట్ వర్గపు పూర్వకాల మహారాజు పేరిట విశ్వ విద్యాలయ ఏర్పాటు లాంటి వ్యూహాలతో జాట్లనూ, ఇతరులనూ తన వైపు తిప్పుకొనేపనిలో ఉంది.
ముజఫర్ నగర్ మతఘర్షణలతో 2014 జాతీయ ఎన్నికలలో, ‘ఎస్పీ ప్రభుత్వం ముస్లిమ్ అను కూలమ’నే వాదనతో 2017 అసెంబ్లీ ఎన్నికలలో, మెజారిటీలదే ఇష్టారాజ్యమనే అంతర్లీన వైఖరితో కూడిన జాతీయవాదంతో 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పైచేయి సాధించినట్టు ఓ విశ్లేషణ. ఇక, రానున్న 2022 ఎన్నికల్లో హిందూ ఓట్ల ఏకీకరణపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అయితే, ఈ కుల, మత ఓటుబ్యాంకు రాజకీయాలతో ఎన్నికల పోరు సాగించాలనుకోవడం సామాజిక సామరస్యానికే ప్రమాదం. బీజేపీ మిత్రపక్షాలే గుర్తుచేస్తునట్టు ఈ దేశం అన్ని మతాలదీ, కులాలదీ. ఆ సమైక్యతను దెబ్బతీసే మాటలు, చేతలు ఎవరివైనా తప్పే. రాజకీయ నేతల మాటలు పొదుపుగా ఉండాలి. చేతలు అదుపులో ఉండాలి. దేనిపై నియంత్రణ లేకపోయినా చిక్కే. కానీ దేశానికి గుండె లాంటి యూపీ ఎన్నికలయ్యేలోగా ఇలాంటి మాటలు, చేష్టలు ఇంకెన్ని చూడాల్సొస్తుందో అబ్బాజాన్!
Yogi Adityanath: ఈ రాజకీయమేంటి అబ్బాజాన్?
Published Wed, Sep 15 2021 12:08 AM | Last Updated on Wed, Sep 15 2021 7:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment