భారత్‌లోనూ ‘బంగ్లా’ పునరావృతం
హిందువులకు యోగి హెచ్చరికలు
ముస్లిం విద్వేషానికి రుజువు: ఒవైసీ
‘ప్రధాని’లా ప్రవర్తించొద్దు: అఖిలేశ్
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు.
కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment