
లక్నో: ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 72 గంటల నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రముఖ దేవాలయం హనుమాన్ సేతు దేవాలయాన్ని మంగళవారం సందర్శించారు. ప్రస్తుత ఎన్నికలు ఆలీ, బజరంగ్ బలీ మధ్య జరిగే పోటీ అంటూ హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని చూపేలా మీరట్ సమావేశంలో సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం 72 గంటల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. యోగి ఆలయానికి వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు జై గోరఖ్‌ధామ్, జై బజరంగ్ బలీ జీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సుమారు ఆలయంలో ఆయన 25 నిమిషాలు ఉన్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో లక్నో లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు గాను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించిన రోడ్‌షోలో సైతం యోగి పాల్గొనలేదు. అలాగే నగీనా, ఫతేపూర్ సిక్రీలలో నిర్వహించాల్సి ఉన్న ర్యాలీలనూ ఆయన రద్దు చేసుకున్నారు. మరోవైపు, ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలోని రామ్‌లల్లా(రాముడు)ను దర్శించుకోనున్నారు. తర్వాత దగ్గర్లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేయనున్నారు. సాయంత్రం బలరాంపూర్ జిల్లాలోని దుర్గామాత ఆలయం దేవిపటన్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల సంఘం విధించిన నిషేధంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment