
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ తనపై ఈసీ విధించిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారని బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఆరోపించారు. ఆలయాలను సందర్శించడం, దళితుల ఇళ్లలో ఆహారం స్వీకరించడం వంటి చర్యలతో యోగి ఆదిత్యానాధ్ ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన డ్రామాలు చేస్తూ వాటిని మీడియాలో ప్రసారం చేసేలా వ్యవహరిస్తున్నారని మాయావతి మండిపడ్డారు.
యూపీ సీఎం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఈసీ చూసీచూడనట్టు వదిలేస్తోందని ఆమె ఆరోపించారు. ఈసీ బీజేపీ నేతల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ నేతల చర్యలను ఈసీ పట్టించుకోకుంటే ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడం అసాధ్యమని చెప్పారు. కాగా, మాయావతి ఆరోపణలను యూపీ సీఎం మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ తోసిపుచ్చారు.
వ్యక్తిగత హోదాలో ప్రార్థనలు చేసుకునేందుకు ఆలయాలను సందర్శించడం, ఎవరైనా పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మామావతి రాసిచ్చిన స్ర్కిప్టులను మాత్రమే కాకుండా, ఈసీ ఆర్డర్ కాపీని కూడా చదవాలని ఆయన బీఎస్పీ అధినేత్రికి చురకలు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment