గోపాల్‌గంజ్: తన ప్రచారంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) విధించిన 48 గంటల నిషేధం ముగిసిన వెంటనే బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ దళిత వ్యతిరేకి అయినందునే ఉత్తర భారత్‌లో దళితుల రాజధానిగా భావించే ఆగ్రాలో తనను ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించిందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయుధ దళాల ప్రస్తావనను తీసుకొచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినప్పటికీ ఈసీ మౌనం పాటించిందని ఆమె వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ‘న్యాయ్’పథకంపై కూడా విమర్శలు చేశారు. ‘ఆ పథకం ఒక గారడీ. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయం నెలకు రూ.6,000 హామీపై మాకు నమ్మకం లేదు’అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment