మణివణ్ణన్
సాక్షి, చెన్నై: ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే అందమైన యువతుల నంబర్లు సేకరించి ప్రేమ పాఠాలు వళ్లిస్తూ వచ్చిన ఓ సీఐ మన్మథుడి లీల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణలో ఒకటి కాదు, పదుల సంఖ్య మహిళలకు ఈ అధికారి వేధింపులు ఇచ్చి ఉండడంతో బలవంతంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేసి ఉండడం వెలుగు చూసింది. (ఎంక్వైరి పేరుతో మహిళకు అర్థరాత్రి ఫోన్)
తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు సిరువనూరు పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మణివణ్ణన్ పనిచేస్తున్నారు. పలు స్టేషన్లలో పనిచేసి, ఇక్కడకు వచ్చిన మణివణ్ణన్, తానోమన్మ«థుడు అన్నట్టుగా వ్యవహరించే వారని సమాచారం. స్టేషన్‌కు అందమైన యువతులు, మహిళలు వస్తే చాలు తన గదిలోకి పిలిపించి మరీ వారి విన్నపాలు, ఫిర్యాదులు స్వీకరించే వారు. వారి ఫోన్ నంబర్లను సేకరించి రాత్రుల్లో విచారణ పేరిట మాటలు కలిపి, తర్వాత ప్రేమ పాఠాలు వల్లించే పనిలో పడ్డట్టున్నారు. ఓ యువతిని తన వైపునకు తిప్పుకునేందుకు మణివణ్ణన్ సాగించిన లీల అంతా ఇంతా కాదు. చివరకు ఫిర్యాదు ఇచ్చిన ఆ యువతికి వ్యతిరేకంగానే కేసు నమోదు చేయించేందుకు సిద్ధమయ్యారు. చివరకు విసిగి వేసారిన ఆ యువతి ఏకంగా డీఐజీ బాలకృష్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆడియోను సమర్పించారు. దీనిపై రహస్య విచారణ సాగగా, ఒక్క ఆయువతినే కాదు, అనేక మంది మహిళలు వద్ద, గతంలో తాను పనిచేసిన చోట్ల కూడా ఈ పోలీసు మన్మథుడు సాగించిన లీలలు ఒకటి తర్వాత మరకొటి వెలుగు చూశాయి.
బలవంతంగా పదవీ విరమణ..
ఈ పోలీసు మన్మథుడి లీలలు ఆధారాలతో సహా బయట పడడంతో డీఐజీ బాలకృష్ణన్ కఠినంగానే వ్యవహరించారు. ఇతగాడు విధుల్లో కొనసాగిన పక్షంలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే యువతులు, మహిళలకు భద్రత కరువు అవుతుందేమో అన్న ఆందోళనను పరిగణించినట్టున్నారు. ఇక, విధుల్లో మణివణ్ణన్ కొనసాగేందుకు వీలు లేదని ఆదేశిస్తూ, బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు తగ్గ చర్యలు చేపట్టారు. మణివణ్ణన్ పదవీ విరమణ చేయడానికి మరో ఆరేళ్లు సమయం ఉన్నా, ముందుగానే ఆయన చేత బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు సర్వం డీఐజీ సిద్ధం చేసినట్టున్నారు. దీంతో సెలవుపై చెక్కేసిన మణివణ్ణన్ తాజాగా మళ్లీ స్టేషన్‌లో ప్రత్యేక్షం అయ్యారు. ఇందుకు కారణం, డీఐజీ మార్పు జరగడమే. డీఐజీ మారడంతో తన ఉద్యోగానికి ఇక, డోకా లేదనుకున్న మణివణ్ణన్‌కు పెద్ద షాక్ తప్పలేదు. స్టేషన్‌కు వెళ్లిన ఆయనకు అక్కడి సిబ్బంది డీఐజీగా బాలకృష్ణన్ జారీ చేసి వెళ్లిన ఆదేశాల ఉత్తర్వులను మణివణ్ణన్ చేతిలో పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment