సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను నవంబర్ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది.
తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్‌లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ నెగ్గింది. ఇప్పటికే ఎల్‌వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్ అర్హత సాధించింది.
భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment