అక్రమాల అడ్డుకట్టకు చట్ట సవరణ
• బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
• దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్
• పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు అడ్డుకట్ట వేయడానికి చట్ట సవరణ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేదవాడికి అందాల్సిన ఫలాలు పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, గత రెండేళ్లుగా పౌర సరఫరాల శాఖను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుధవారం ఇక్కడ ఆయన, ఆ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్, జాయింట్ కలెక్టర్లు, డీఎస్‌వోలు, డీఎంలతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. చట్టసవరణ కోసం వెంటనే ఒక కమిటీని వేయాలని కమిషనర్‌కు సూచించారు.
ఈ ఖరీఫ్‌లో కనీసం 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని, ప్రతి రైతుకు కనీస మద్దతుధర లభించేలా చూడాలని, ఆన్‌లైన్ విధానం లోనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ.1,075 కోట్లతో చేపట్టిన కొత్త గోదాముల నిర్మాణం 70% పూర్తయ్యిందని, ఈ సీజన్‌లోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. దీపం పథకం కింద 20 లక్షల గ్యాస్ కనెక్షన్ల మంజూరు లక్ష్యం కాగా, 8 లక్షల మందికే ఇవ్వడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానం వల్ల 25 శాతం అక్రమ రవాణకు అడ్డుకట్ట పడడడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
రూ.203 కోట్ల బకాయిల వసూలు: సీవీ ఆనంద్
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద మిల్లర్ల దగ్గర పెండింగ్‌లో ఉన్న రూ.482 కోట్ల విలువైన బియ్యం నిల్వలకు ఇప్పటివరకు రూ.203 కోట్ల మేర బకాయిలను రాబట్టామని కమిషనర్ సి.వి.ఆనంద్ మంత్రికి వివరించారు. ఈ నెల 30లోగా పూర్తిస్థాయిలో సీఎంఆర్ బకాయిలను మిల్లర్ల నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం తీసుకెళ్లే వాహనాలు దారిమళ్లితే ఆ సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో అందేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రైతుల దగ్గర కొన్ని ధాన్యానికి 4 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.