ఈపాస్’ ద్వారా తీసుకుంటేనే రేషన్ సరకులు.. లేకుంటే లేనట్టే. ఇప్పటి వరకు వేలిముద్రలు పడకపోయినా.. మిషన్లు పనిచేయకపోయినా పాతపద్ధతిలో సరకులిచ్చేవారు.
పాత పద్ధతిలో పంపిణీ లేనట్టే..
వేలిముద్రలు పడని వారికి ప్రత్యేక ఆప్షన్
పంపిణీ మేరకే సరకుల లిఫ్టింగ్
విశాఖపట్నం: ‘ఈపాస్’ ద్వారా తీసుకుంటేనే రేషన్ సరకులు.. లేకుంటే లేనట్టే. ఇప్పటి వరకు వేలిముద్రలు పడకపోయినా.. మిషన్లు పనిచేయకపోయినా పాతపద్ధతిలో సరకులిచ్చేవారు. ఇక నుంచి ఈ అవకాశం లేదు. ఈ‘పాస్’యితేనే సరకులు లేకుంటే ఆశలు వదులుకోవల్సిందే. జిల్లాలో ఈపాస్ అమలవుతున్న 1604 రేషన్ షాపుల పరిధిలో 9.50 లక్షల కార్డులుండగా ప్రతి నెలా ఏడున్నర లక్షలమంది కార్డుదారులకు ఈపాస్ ద్వారా సరకుల పంపిణీ జరుగుతోంది. క్రమం తప్పకుండా సరకులు తీసుకునే మరో 50 వేలమందికి సాంకేతిక కారణాలవల్ల మిషన్లు పనిచేయకున్నప్పటికీ పాత పద్ధతిలోనే పంపిణీ చేసేవారు. వచ్చే నెల నుంచి పాతపద్ధతిలో సరకుల పంపిణీకి ఫుల్‌స్టాప్ పెట్టడం నిరుపేదలకు అశనిపాతంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 76 శాతం, గ్రామీణ ప్రాంతంలో 89 శాతం వరకు సరకుల పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు క్లోజింగ్ బ్యాలెన్స్‌కనుగుణంగానే కార్డుల సంఖ్యను బట్టి మరుసటి నెల సరకుల కేటాయింపు జరిగేది. డిసెంబర్‌లో ఈపాస్ వర్తింప చేసే షాపుల కు సరకుల కేటాయింపులో 10 శాతం కోత విధించారు. జనవరి నుంచి నూరు శాతం ఈపాస్‌లో పంపిణీ జరిగిన సరకుల మేరకే లిఫ్టింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. పైగా గతంలో మాదిరిగా ఇండెంట్ పెట్టుకోవల్సిన అవసరం లేదు. ప్రతి నెలా 22వ తేదీన ఈపాస్ మిషన్ నెంబర్ కొట్టగానే ఆ మిషన్ ఏ డీలర్‌కు చెందింది.? ఆ షాపులో ఆ నెలలో ఎన్ని కార్డులకు సరకుల పంపిణీ జరిగింది? మెయిన్ సర్వర్‌లో తెలిసిపోతుంది. తదనుగుణంగా ఆటోమేటిక్‌గా లిఫ్టింగ్ జనరేట్ అయిపోతుంది. సరకుల కోసం గతంలో మాదిరిగా మండల లెవల్ సప్లయి (ఎంఎల్‌ఎస్) పాయింట్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈపాస్ ద్వారా జనరేట్ అయ్యే లిఫ్టింగ్‌ను బట్టి సరకులను నేరుగా సంబంధిత రేషన్ షాపునకు చేరుస్తారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద సరకులు తీసుకునేటప్పుడు, రవాణాలో కూడా తరుగు కన్పిస్తుందని.. తద్వారా నష్టపోవాల్సి వస్తుందంటూ డీలర్లు ఇన్నాళ్లు గగ్గోలు పెట్టేవారు. ఇక నుంచి నేరుగా రేషన్ షాపునకు లిఫ్టింగ్ జరుగనుండడంతో అక్కడే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో సరకులను తూకం వేసి తమకు కేటాయించిన మేరకు సరకులు వచ్చాయా? లేదా? చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇదంతా మాన్యువల్‌గానే జరిగేది. ఇక నుంచి లిఫ్టింగ్ కూడా ఈపాస్ ద్వారానే జరుగనుంది. మిషన్‌లో డీలర్, రూట్ ఆఫీసర్ ఒకేసారి వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.
గత నెలలో సరకులు తీసుకున్న కార్డుదారుని వేలిముద్రలు పడకపోవడం, నెట్‌వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురైతే అటువంటి వారి కోసం ఈపాస్ మిషన్‌లోనే ప్రత్యేకంగా ఆప్షన్ పొందుపరుస్తున్నారు. ఏదైనా తీర్థయాత్రలకు, వ్యక్తిగత అవసరాలు లేదా కూలి పనుల నిమిత్తం కుటుంబసమేతంగా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లడం వలన ఆ నెలలో సరకులు తీసుకోలేకపోతే ఆ మరుసటి నెలలో వారికి సరకులు హుళక్కే. దీంతో ఇప్పటికే ఈపాస్ పుణ్యమాని లక్షన్నర కుటుంబాలకు పైగా రేషన్‌కు దూరం కాగా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక వల్ల ప్రతి నెలా వేలాదిమంది సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ పొందలేని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
జనవరి నుంచి అమలు
డిసెంబర్‌లో ఈపాస్ ద్వారా ఎంతమందికైతే సరకుల పంపిణీ జరుగుతుందో ఆ మేరకే జనవరిలో రేషన్ షాపునకు సరకుల కేటాయింపు జరుగుతుంది. ఇక నుంచి ఈపాస్ బయట ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు. ఇప్పటికే 1604 షాపుల్లో ఈపాస్ అమలు చేస్తున్నాం. మిగిలిన షాపుల్లో కూడా త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తరుగు సమస్య లేకుండా చర్యలు చేపట్టాం.
-జె.నివాస్, జాయింట్ కలెక్టర్