మంచాల: సకల జనుల సర్వేనే అన్నిటికి మూలమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు కూడా ఇంటి దగ్గర ఉండి సర్వే అధికారులకు సహాకరించారు. కాని అధికారులు తప్పుడు సర్వే చేయడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అర్హత ఉండీ రేషన్ సరుకులకు, పింఛన్ వంటి సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. వాస్తవాలు తెలిసిన అధికారులు సైతం సమగ్ర కుటుంబ సర్వే ఫాం ఆధారంగానే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చేతులెత్తేస్తున్నారు. మండలంలో తప్పు డు సర్వే బాధితులు ఎందరో ఉన్నారు సర్వేల్లో దొర్లిన తప్పులు సరి చేయాలని మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.వారి బాధలు వర్ణనాతీతం.
అరకొర వివరాలు..
మండల పరిధిలోని లోయపల్లి గ్రామానికి చెందిన కొర్ర నరేందర్ నాయక్ ఆటో డ్రైవర్. నిత్యం పట్టణం వెళ్లి ఆటో నడుపుకొని వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మితో పాటు కళావతి, రోజా అనే ఇద్దరు కూతుళ్లు, రాజు, మోహన్ అనే ఇద్దరు కూమారులు ఉన్నారు. అదే విధంగా తండ్రి దేవా(75) కూడా ఉన్నారు. వీరిది ఒకే కుటుంబం. కళావతి డిగ్రీ, రోజా ఇంటర్‌మీడియట్, రాజు ఎనిమిదవ తరగతి, మోహన్ నాలుగో తరగతి చదువుతున్నారు. సర్వే రోజు అందరూ ఇంటివద్దనే ఉన్నారు.
అందరికీ ఆధార్ కార్డులు ఉండడమే గాకుండా రేషన్ కార్డులో కూడా ఉన్నారు. కాని అధికారులు సమగ్ర కుటుంబ సర్వే ఫాంలో అరకొర వివరాలు పొందుపర్చారు. కేవలం నరేందర్‌నాయక్, అతని భార్య లక్ష్మి, కూతురు కళావతి మాత్రమే ఉన్నట్లు రాశారు. మిగత వారి వివరాలు పొందు పర్చలేదు. దీంతో గత పదిహేను ఏళ్లుగా పింఛన్ పొందుతున్న దేవా వృద్ధాప్య పింఛన్ ఆగిపోయింది. అదే విధంగా వారికి రేషన్ కోటా కూడా తగ్గించారు. వారి పిల్లల వివరాలు ఎస్‌కేఎస్ ఫాంలో లేవని వారికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా,సంక్షేమ పథకాలు అందాలన్నా వారి వివరాలు కచ్చితంగా ఎస్‌కేఎస్ ఫాంలో ఉండాలి. వారిని మాత్రమే గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మా పిల్లల పరిస్థితి ఏమిటని నరేందర్ నాయక్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. నిత్యం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు తామేమీ చేయలేమని, ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాకే మళ్లీ వారిని ఎస్‌కేఎస్ ఫాంలో చేర్చుకోవడం జరుగుతుందని కచ్చితంగా చెప్పేస్తున్నారు... ఇలా తప్పుడు సర్వే వల్ల గ్రామాల్లో చాలా మంది తీవ్ర అన్యాయానికి గురై ఉన్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించి సర్వేలో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా ఎస్‌కేఎస్ సర్వే ఫాం ద్వారా పొందుపర్చిన వివరాల ఆధారంగానే తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తప్పులను సరిచేయడం తమ చేతిలో పని కాదన్నారు. ఉన్నతాధికారుల నుండి తగిన సూచనలు రావాలని అన్నారు.
తప్పుడు సర్వేతో తిప్పలు
Published Sun, Dec 28 2014 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement