తప్పని పొడిగింపు | Wrong extension | Sakshi
Sakshi News home page

తప్పని పొడిగింపు

Published Sun, Sep 21 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

Wrong extension

  • రెండు రోజుల సర్వే అంతంత మాత్రమే
  •  నేడు, రేపు కూడా చేయాలని నిర్ణయం
  •  అవసరమైతే 23న కూడా ఇంటింటికీ
  •  పింఛనుదారుల వివరాల నమోదుకు మొబైల్ అప్లికేషన్
  • సంక్షేమ పథకాలను భారంగా భావిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం పింఛనుదారుల సంఖ్యను తగ్గించడానికి తెరపైకి తెచ్చిన ‘సమగ్ర సర్వే’ అనుకున్నట్టు జరగలేదు. కేవలం రెండ్రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తిచేయాలనుకోవడంతో ప్రభుత్వానికి ఒక అంచనా, వాస్తవ దృక్పథం లేదని మొదట్లోనే అర్థమైంది. అక్టోబర్ నుంచి వృద్ధులకు, వికలాంగులకు పింఛను మొత్తం పెంచుతామంటూనే ఈలోగా లబ్ధిదారుల సంఖ్య కుదించడానికి ఆదరాబాదరాగా తెలుగు తమ్ముళ్లతో సర్వే కమిటీలను నింపేసింది. తీరా రంగంలోకి దిగాక  వారు 20 శాతం వివరాలు  కూడా సేకరించలేకపోవడంతో సర్వే గడువు పొడిగించక తప్పలేదు.
     
    విశాఖ రూరల్ : పింఛనుదారుల సమగ్ర సర్వే పేరుతో ఏర్పాటు చేసిన ‘పచ్చ’ కమిటీల జాడ కనిపించలేదు. అర్హతల పరిశీలన కోసం చేపట్టాలనుకున్న ఇంటింటి సర్వే అంతంత మాత్రంగానే జరిగింది. కేవలం రెండు రోజుల్లో 3.2 లక్షల మంది పింఛనుదారుల ఇళ్లకు వెళ్లలేక కమిటీలు చేతులెత్తేశాయి. కనీసం 20 శాతం మంది లబ్ధిదారుల వివరాలు కూడా సేకరించలేకపోయాయి. ఇంటింటి సర్వే కోసం వచ్చే కమిటీలకు పింఛనుదారులు అందుబాటులో లేకపోతే వారి పింఛన్లు రద్దవుతాయని చెప్పడంతో లబ్ధిదారులు ఇళ్లకే పరిమితమయ్యారు.

    సర్వే బృందాల కోసం ఎదురుచూపులు చూశారు. కానీ ఏ ఒక్కరు రాకపోవడంతో పింఛన్లు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈలోగా లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత తగ్గించాలని భావిస్తూ ప్రభుత్వం సర్వే చేపడుతోంది.
     
    సర్వే గడువు పెంపు : రెండు రోజుల్లో సర్వే చేయడం సాధ్యం కానప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నేతలతో గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. దాని ప్రకారం జిల్లా అధికారులు కమిటీలు వేశారు.

    శుక్ర, శనివారాలు ఇంటింటి సర్వే నిర్వహించాలంటూ వారికి సూచనలు కూడా చేశారు. కానీ సర్వే 20 శాతం కూడా పూర్తికాలేదు. ఫలితంగా సర్వే గడువును మరో రెండురోజులకు పొడిగించారు. ఈ నెల 21, 22 తేదీల్లో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికీ పూర్తి కాని పక్షంలో 23వ తేదీన నిర్వహించాలని సూచించింది. ఆ మేరకు జిల్లా అధికారులు కమిటీలకు ఆదేశాలు జారీచేశారు.
     
    సర్వేకు మొబైల్ అప్లికేషన్

    సర్వేలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, లబ్ధిదారుల జాబితా స్పష్టంగా తెలుసుకొనేందుకు వీలుగా జిల్లా అధికారులు మొబైల్ అప్లికేషన్‌ను తయారు చేయించారు. దాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారు అర్హులుగా గుర్తించిన వెంటనే మొబైల్ అప్లికేషన్‌లో టిక్ చేస్తారు. ఒకవేళ అనర్హులుగా గుర్తిస్తే అందుకు గల కారణాలను అందులో పేర్కొంటూ తిరస్కరిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఎంతమందిని సర్వే చేశారన్న విషయం స్పష్టంగా జిల్లా అధికారులకు తెలిసిపోతుంది. సర్వే పూర్తయిన తరువాతే కొత్తవారి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement