సాక్షి, అమరావతి: అది రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం ఎప్పుడో ప్రకటించిన పథకం. అదేమీ కొత్తది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. క్యూ లైన్లలో నించుని, కూలి పనులు మానుకుని చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ఇన్నాళ్లకు తమ ఇంటివద్దే రేషన్ బియ్యం అందబోతున్నాయని గ్రామీణ పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పేదల ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, పేదలకు తిండిగింజలు అందించటాన్ని సానుకూలంగా చూడాలని హైకోర్టు సైతం సూచించినా పెడచెవిన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన మొబైల్ వాహనాలపై ఉన్న రంగులతో పాటు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ బొమ్మలను తొలగించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. తొలుత ఒక వాహనానికి మాత్రం ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి తాను పరిశీలించేందుకు తీసుకుని రావాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగు మార్చిన ఆ వాహనాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆ మార్పులకు తాను అనుమతిస్తేనే వాహనాలు తిప్పాలన్నారు.
ముందస్తు వ్యూహంతోనే..
మొబైల్ వాహనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను మార్పు చేసి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పాత రంగులు వేయాలని భావించరాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ ప్రకటించారు. దీన్నిబట్టి ఆయన ముందస్తు వ్యూహంతో, నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేలా పక్కా స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఎప్పుడో సిద్ధమైన వేల వాహనాలకు ఇప్పటికిప్పుడు రంగులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఇప్పట్లో జరిగేపని కాదనే ఎస్‌ఈసీ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉత్తర్వును జారీ చేసినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినా..
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సరుకుల పంపిణీ కోసం మొబైల్ వాహనాలను వినియోగించడానికి వీల్లేదని గత నెల 28న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పథకం రాజకీయ కార్యక్రమం కాదని, ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇంటింటా రేషన్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న ఐదు రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనాల గురించి ఎస్‌ఈసీకి పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు. పథకం అమలుæ కోసం వినియోగించనున్న మొబైల్ వాహనాలను ఈనెల 3న నిమ్మగడ్డ పరిశీలించారు. అయితే ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు సూచించిన విషయాలను ఆయన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తొలుత మొబైల్ వాహనాలపై ఉన్న రంగులను తొలగించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పేదలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.
బియ్యం బండిపై మొండిగా!
Published Sat, Feb 6 2021 5:57 AM | Last Updated on Sat, Feb 6 2021 5:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment