పెద్దిరెడ్డి గృహ నిర్బంధ ఉత్తర్వులు రద్దు | AP High Court Issued Interim Orders On Peddireddy Ramachandra Reddy Petition | Sakshi
Sakshi News home page

పెద్దిరెడ్డి గృహ నిర్బంధ ఉత్తర్వులు రద్దు

Published Mon, Feb 8 2021 4:46 AM | Last Updated on Mon, Feb 8 2021 6:54 AM

AP High Court Issued Interim Orders On Peddireddy Ramachandra Reddy Petition - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి విచారణ జరిపారు.   

రాజ్యాంగ హక్కులను కమిషనర్‌ హరించారు  
సీవీ మోహన్‌రెడ్డి తొలుత వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులను హరించేలా ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే ఎన్నికల కమిషనర్‌ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డిపై ఉంది. ఒకే నామినేషన్‌ వచ్చినప్పుడు రిటర్నింగ్‌ అధికారి వెంటనే ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఎన్నికల ఫలితాన్ని ప్రకటించడానికి ముందే, ఆ ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపడానికి, ఫలితాల వాయిదాకు వీల్లేదు. ఎన్నికల కమిషనర్‌ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు’ అని వివరించారు.  

ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను ప్రశ్నించడానికి వీల్లేదు  
ఎన్నికల కమిషన్‌ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల కమిషనర్‌ తనకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించవచ్చు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బతీసేవిగా, కమిషనర్‌ అధికారాలను ప్రశ్నించేవిగా ఉన్నాయి. అధికారులను బ్లాక్‌ లిస్ట్‌ చేస్తామని బెదిరించడం ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని చెప్పారు.  

ఆ అధికారం ఎస్‌ఈసీకి లేదు 
వ్యక్తిగత స్వేచ్ఛను చట్ట నిబంధనలకు లోబడే నియంత్రించాల్సి ఉంటుందని ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. హౌస్‌ అరెస్ట్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని తెలిపారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధం అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు జోక్యం చేసుకుంటూ.. ‘చట్ట నిబంధనలు అనుమతిస్తున్నప్పుడు మాత్రమే ఓ వ్యక్తిని గృహ నిర్బంధం చేయవచ్చు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకున్న అధికారాన్ని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసేందుకు పొడిగించడానికి వీల్లేదు.

ఈ నెల 21వ తేదీ వరకు పిటిషనర్‌ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నది న్యాయస్థానం అభిప్రాయం. ఇదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ అపరిమితమైనది కాదు. అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది’ అని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ నెల 21వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉండాలన్న ఉత్తర్వులను రద్దు చేస్తున్నామన్నారు. అయితే మీడియాతో మాట్లాడకూడదన్న ఉత్తర్వులు 21 వరకు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, నిమ్మగడ్డ రమేశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement