ఈ-పాస్ ఫెయిల్
మొరాయిస్తున్న సర్వర్లు
ఏడునెలలైనా వీడని బాలారిష్టాలు
సరకుల కోసం రోజూ నరకమే
సర్వర్ డౌన్ అయిపోయింది... మిషన్ పనిచేయడం లేదు..ఎప్పుడు పని చేస్తుందో తెలియదు..చెప్పలేం..ఏ రేషన్ షాపునకు వెళ్లినా ఇవే సమాధానాలు. కూలి పనులు మానుకొని చెప్పులరిగేలా తిరుగుతున్నా గంటలు కాదు.. ఏకంగా రోజుల తరబడి షాపుల వద్ద పడిగాపులు పడుతున్నా రేషన్ సరకులు అందక పోవడంతో కార్డుదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ-పాస్ అమలులోకి వచ్చి ఏడునెలలైనా బాల రిష్టాలను మాత్రం సర్కార్ అధిగమించలేక పోవడం సామాన్యులకు శాపమవుతోంది.
విశాఖపట్నం : జిల్లాలో 2016 రేషన్‌షాపులుంటే వాటి పరిధిలో 11,22,053 బీపీఎల్ కార్డులున్నా యి. వాటిలో తెల్ల్లకార్డులు సిటీలో 3,61,251 రూరల్‌లో 6,64,199 ఉన్నాయి. ఏఏవై కార్డులు సిటీలో 7,887, రూరల్‌లో 64,866, అన్నపూర్ణ కార్డులు సిటీలో 386, రూరల్‌లో 614కార్డులున్నాయి. గత నెల వరకు నగర పరిధిలోని 412 షాపులతో సహా మొత్తం 1172 షాపుల్లో ఈ-పాస్ అమలు చేసే వారు. ఈ నెల నుంచి మరో 436 షాపులకు విస్తరించారు. ఏజెన్సీ పరిధిలోని 385 షాపులతో పాటు మైదానంలోని మారుమూల ప్రాంతాల్లో 12షాపుల్లో నెట్‌వర్కింగ్ లేదంటూ పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తున్నారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో 1608 షాపుల్లో ఈ-పాస్ అమలవుతోంది. క్రమేపీ ఈపాస్ షాపుల సంఖ్య పెంచుకుంటూ పోవ డం..అదే స్థాయిలో సర్వర్ కెపాసిటీ లేకపోవడంతో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఏ షాపు దగ్గరకు వెళ్లినా సర్వర్ డౌన్ అయింది..ఎప్పుడు పని చేస్తుందో చెప్ప లేం..ఆ తర్వాత మమ్మల్నితిట్టొద్దు అంటూడీలర్లు ముందుగానే కార్డుదారులకు చెబుతూ వారి ఆగ్రహావేశాల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. సర్వర్ కనెక్ట్ అయినా ఈపాస్ మిషన్ మొరాయిస్తుండడం.. వేలిముద్రలు పడక పోవడంతో సామాన్యులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
గంటల తరబడి షాపుల వద్ద వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక సర్కార్‌పై నానాశాపనార్ధాలు పెడుతూ నిరాశతో వెనుదిరుగుతున్నా రు. ఇలా ఒకరోజు..రెండు రోజులు కాదు రోజుల తరబడి తిరుగుతున్నా ఎప్పుడు సరకులందుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ఈ నెలలో సరకులు తీసు కోకపోతే వచ్చే నెలలో తమ కార్డులను ఎక్కడ పక్కన పెట్టేస్తారోనన్న ఆందోళనతో పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ప్రతీనెలా ఒకటవ తేదీ నుంచి ప్రారంభించే సరకుల పంపిణీ 15వ తేదీతో ఆపేస్తారు. ఈ మధ్యలో సెలవులు ఎక్కువగా వచ్చినా లేదా సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉన్నా 18వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. అప్పుడే 13వ తేదీ దాటింది. కానీ జిల్లాలో పంపిణీ 35శాతానికి మించలేదు. కొత్తగా ఈ నెల నుంచి శ్రీకారంచుట్టిన 436 షాపులతో పాటు మెజార్టీ షాపుల్లో అయితే కనీసం పదిశాతం కూడా పంపిణీ జరగలేదు. దీంతో కార్డుదారులు సరకులు కోసం నరకం చూస్తున్నారు. తాను వారం రోజులుగా షాపునకు వెళ్లడం..సర్వర్ డౌన్ అయిందని చెప్పడం..వెనుతిరగడం పరిపాటయిందని ఎస్.రాయవరానికి చెందిన బీ.అప్పారావు సాక్షి వద్ద వాపోయారు. ఇచ్చే రూ.150ల విలువ చేసే సరకులుకోసం రోజుకు రూ.200ల కూలీ పనులు మానుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి శాంతకుమారి వద్ద ప్రస్తావించగా..ఒకేసారి రాష్ర్ట స్థాయిలో షాపుల సంఖ్య పెరగడంతో ఆ భారం సర్వర్లపై పడిందని..దీంతో తరచూ సర్వర్ డౌన్ అవుతోందని చెప్పుకొచ్చారు. ఒకటి రెండ్రోజుల్లో సమస్యకు పరిష్కార మవుతుందన్నారు.
బియ్యం ఇవ్వని యంత్రం
Published Fri, Nov 13 2015 11:14 PM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement
Advertisement