
రేషన్‌కు మంగళం!
జనవరి నుంచి 2.60 లక్షల మందికి సరకులు లేనట్టే..
సంక్రాంతి కానుకకూ వీరు దూరం
యూఐడీ సీడింగ్ కాలేదంటూ సాకు
రచ్చబండ కూపన్లూ రద్దు
విశాఖపట్నం : జిల్లాలోని రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి రేషన్ సరకులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. సర్కారు విధిస్తున్న నిబంధనలు కార్డుహోల్డర్లపాలిట శాపంగా పరిణమించి రేషను అందకుండా చేయనున్నాయి. రూ.500కు పైబడి విద్యుత్ బిల్లులు వస్తున్నాయంటూ ఇప్పటికే 50వేల రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే రచ్చబండలో ఇచ్చిన 69వేల కూపన్లకూ జనవరి నుంచి సరకులకు మంగళం పలకనుందని తెలిసింది. కార్డుల్లో యూఐడీ సీడింగ్ కాలేదంటూ మరో 8.76లక్షల మందికి సరుకులు నిలిపి వేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2.60లక్షల కార్డుదారులకు కొత్త సంవత్సరం ఆరంభం నుంచి రేషను అందనట్టే.
వరుస కత్తెర ఇలా: జిల్లాలో10,76,313 కార్డులపరిధిలో 4,13, 283 కార్డుదారులు(అన్‌సీడెడ్ యూనిట్స్)ను తొలగిం చారు. యూనిక్ ఐడీ సీడింగ్ కాని 7,50,354 సభ్యులతో పాటు ఇంతవరకు సీడింగ్ కాని 1,25,519 మందికి జనవరి నుంచి సరుకులు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియవచ్చింది. యూఐడీ నెంబర్లతో సీడింగ్ చేయించుకున్న వారికి మాత్రమే సరుకులు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్టుగా చెబుతున్నారు. గతసర్కార్ రచ్చబండ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 38,624, సిటీలో 57,276 కూపన్లు పంపిణీ చేసింది. వీటికి ఆధార్, ఫామిలీ ఫోటోలు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో 80 శాతంమంది సమర్పించినా సిబ్బంది వైఫల్యంతో అప్‌లోడ్ కాలేదని సమాచారం. సిటీలో 32,218, రూరల్ పరిధిలో 26,254మంది కూపన్లవారికి జనవరి 1వ తేదీ నుంచి సరుకులు నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలొచ్చినట్టు తెలిసింది. ఉచిత సరకుల జాబితాలో రచ్చబండ కూపన్ దారులు లేరని డీలర్లు బాహాటంగానే చెబుతున్నారు. యూఐడీ సీడింగ్ కాని వారితో పాటు రచ్చబండ కూపన్‌దారులకు పంపిణీ చేయనవసరం లేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు.
సంక్రాంతి కానుక కొందరికే: సంక్రాంతికి సర్కారు ప్రకటించిన రాయితీ కొందరికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. నెలవారీ ఇచ్చే బియ్యం,పంచదారతో పాటు అరకేజి పామాయిల్, అరకేజి కందిపప్పు, కేజీ శెనగలు, కేజీ గోధుమ పిండి, వంద గ్రాముల నెయ్యి, అరకేజి బెల్లంతో కూడిన కిట్‌ను సంక్రాంతి కానుక పేరిట అల్పాదాయ వర్గాల వారికి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో నిరుపేదలైన కార్డుదారులంతా ఆనందపడ్డారు. సర్కారు కార్డులకు ఎసరు పెడుతుండటంతో రెండున్నర లక్షల మంది రేషనుతోపాటు ఈ సంక్రాంతి కిట్టును పొందే అవకాశం కోల్పోతున్నారు. పై విషయాలను కలెక్టర్ ఎన్.యువరాజ్ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమిలేదన్నారు. ఇంత వరకు అధికారికంగా ఆదేశాలు రాలేదని చెప్పారు.