లంఖణం(పస్తు ఉండడం) దివ్య ఔషధం అన్నారు పెద్దలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యమేమో గాని..ఏకంగా నెలంతా ప్రతిరోజూ పస్తులుంటే శుష్కించి అనారోగ్యం బారిన పడతారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా చౌకధరలకు సరుకులను పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాల్లో డిపోలకు అందజేసిన ఈ పోస్ మెషీన్లు సరిగా పనియకపోవడం, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు స్కాన్ అవకపోవడం వంటి ఇబ్బందులతో లబ్ధిదారులకు వచ్చిన రేషన్ కాస్తా తిరిగి వెళ్లిపోతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. సరుకులు అందకుండా వెనక్కి వెళ్లిపోతే నెలంతా పస్తులుండాల్సిదేనని వాపోతున్నారు.
* జిల్లాలో 76వేల మందికి పైగా అందని రేషన్
* ఇబ్బందుల్లో లబ్ధిదారులు
భోగాపురం: జిల్లాలోని 34మండలాల్లో ఈ పోస్ ద్వారాపనిచేస్తున్న 1341 రేషన్ షాపుల్లో 6,62,681 లబ్ధిదారులు ఉండగా ఫిబ్రవరిలో కేవలం 5,86,080మందికి మాత్రమే రేషన్ సరుకులు అందాయి. ఈ పోస్ సిగ్నల్స్ అందని షాపులు జిల్లాలో 30నుంచి 40వరకు ఉండవచ్చు. వారికి మాన్యువల్‌గానే సరుకులు అందిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈనెల సరుకులు 88.44శాతం పంపిణీ జరిగాయి.
జిల్లాలో అత్యధికంగా కొత్తవలసలో 93.49శాతం సరుకులు అందించగా, అతితక్కువగా మెంటాడ మండలంలో 84.79శాతం సరుకులను మాత్రమే అందించారు. దీంతో ఈనెల చౌకధరల దుకాణాల ద్వారా 76,541మంది సరుకులను పొందలేకపోయారు. జిల్లాలో ఇన్‌చార్జ్ డీలర్లు ఎక్కువగా ఉండడం, ఈపోస్ మెషీన్లు పనిచేయకపోవడం. మెషీన్లు పనిచేసినా ఇంట్లో ఒక్కరే ఉన్న కార్డుల్లో వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో సరుకుల పంపిణీ కాలేదు.
అయితే రేషను సరుకులపైనే ఆధారపడే పేదవారు ఈపోస్ విధానం ద్వారా సరుకులు పొందలేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతినెలా 15నుంచి 20వ తారీఖుల్లో ఈ పోస్ ఆన్‌లైన్ ఆగిపోవడంతో సరుకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రేషన్ ఇస్తున్నారంటే చాలు లబ్ధిదారులు పగలనక, రాత్రనక డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. పడిగాపులు కాసినా తీరా వారివంతు వచ్చేసరికి వేలిముద్రలు పడకపోవడమో, సర్వర్ ఆగిపోవడమో జరుగుతుండడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలోని ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నెలలో సుమారు 10వేల మంది లబ్ధిదారుల రేషన్ వెనక్కి వెళ్లి పోయింది. దీంతో లబ్ధిదారులు ఈనెల ఏంతిని బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులు తిరిగినా రేషన్ రాలేదు
మాది భోగాపురం మండలం రావాడ పంచాయతీ చినరావాడ గ్రామం. మేము రేషన్ అందుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావాడ గ్రామానికి వెళ్లాలి. నా వయసు 80ఏళ్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను. వారంరోజులు తిరిగాను వేలి ముద్రలు పడలేదని వెనక్కి పంపించేశారు. కోటా బియ్యమే ఆధారం. నెలకు నాకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కూడా అందలేదు.
- బమ్మిడి అచ్చెమ్మ, చినరావాడ
రేషను సరుకులకు ఇబ్బంది పడుతున్నాం
రేషన్ సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెషీన్లు పనిచేయడం లేదని సరుకులు రాత్రిపూట ఇవ్వడంతో మా గ్రామం నుంచి చీకట్లో ఇబ్బందులు పడి మరీ వెళ్తాం. అయినా నాకు రేషను అందలేదు. రావాల్సిన ఐదుకేజీల బియ్యం అందకపోతే ఏం తిని బతకాలి. మా పరిస్థితి ఏంటి?
- ఇప్పిలి తాత, చినరావాడ
పస్తులు తప్పవా..?
Published Sat, Feb 20 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement