అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.
విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్‌లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.
ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
Comments
Please login to add a commentAdd a comment