మచిలీపట్నంలో రేషన్ సిద్ధం చేస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్ సరుకులను నేటి నుంచి అందించనున్నారు. రేషన్ షాపులకు సరుకులు ఇప్పటికే చేరుకున్నాయి. మొదటి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ∙రెండో విడత సరుకులను లబ్దిదారులకు పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందించనున్నారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకు మూడు విడతలు రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.
–ఈసారి రేషన్ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్ధిదారులకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేశారు.
–వలంటీర్ల ద్వారా కూపన్లను కార్డుదారులకు అందిస్తున్నారు.
–కూపన్లపై రేషన్ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వివరాలు ముద్రించి ఉంటాయి.
–లబ్దిదారులు వేలిముద్ర వేయకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు.
–రాష్ట్రంలోని 14,315 రేషన్ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట్ల రద్దీని నియంత్రించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
–8 వేల రేషన్ షాపుల్లో సింగిల్ కౌంటర్, 3,800 షాపుల్లో రెండు కౌంటర్లు, 2,500 షాపుల్లో అదనంగా 3 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు.
–రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉంటే 92 లక్షల కార్డులకే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. మిగిలిన 55 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది.
–బియ్యం కార్డులు పొందేందుకు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత సరుకులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
–లాక్‌డౌన్ వల్ల పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న లక్షల మంది కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం ద్వారా సరుకులు పొందేందుకు కూపన్లు జారీ చేశారు.
–కరోనా వైరస్ వల్ల రెడ్ జోన్‌గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీలైతే ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
–రేషన్ అందకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురైతే 1902 నంబర్‌కి కాల్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment