ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతినెలా రేషన్ డీలర్లకు డీడీలు తీయడానికి *400నుంచి *500 వరకు ఖర్చవుతోంది. దీంతో రేషన్‌డీలర్లపై అదనపు భారం పడుతోంది.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతినెలా రేషన్ డీలర్లకు డీడీలు తీయడానికి *400నుంచి *500 వరకు ఖర్చవుతోంది. దీంతో రేషన్‌డీలర్లపై అదనపు భారం పడుతోంది. దీనిని పౌరసరఫరాల శాఖే భరించాలని కొంతకాలంగా డీలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ *5కే రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కార్డు నంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్‌లో డ బ్బులు జమచేస్తే ఇవి సివిల్ సప్లయి ఖాతాలోకి వెళ్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే నల్లగొండ మండలంలో అమలు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. వచ్చేనెల నుంచి ఈ పద్ధతిని అమలు పరచడానికి కార్డుల్ని ఐసీఐసీఐ బ్యాంకువారు తయారు చేశారు.
తగ్గనున్న శ్రమ....
ప్రీపెయిడ్ విధానం ద్వారా డీలర్లుకు శ్రమతోపాటు సమయం కూడా మిగులుతుంది. డీడీకి అయ్యే సర్వీస్ చార్జ్ కూడా ఆదా కానుంది. ప్రతినెలా వేల రూపాయల డీడీ తీయడానికి బ్యాంకుల్లో బారులుదీరుతున్నారు. డబ్బులు పౌర సరఫరాల శాఖ ఖాతాల్లో జమచేసినా మళ్లీ డీడీకోసం బ్యాంకుల్లో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఇటువంటి శ్రమ ఉండదు. అంతేగాక డీడీకి అవసరమైన సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. తద్వారా డీలర్లపై ఆర్థికభారం తగ్గినట్లే. ప్రీపెయిడ్ విధానం నల్లగొండ మండలంలో విజయవంతమైతే మొదటగా జిల్లావ్యాప్తంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కలెక్టరేట్‌లో నల్లగొండ మండలంలోని 70 మంది రేషన్ డీలర్లకు ప్రీపెయిడ్ విధానంపై డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి ప్రీపెయిడ్ కార్డులు అందజేశారు.