భువనగిరి : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఉప్పు పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి.
9 సరుకులు జాడే లేదు
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9,333 ఉండగా వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తె ల్ల రేషన్‌కార్డులపై 9 రకాల సరుకులను రూ.185కే అందించడానికి ‘అమ్మహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం 9 సరుకులకు గాను కేవలం బియ్యం, అడపాదడపా చక్కర మాత్రమే ఇస్తుండటంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో అతిపెద్ద పండగలైన బతుకమ్మ, దసరాకు ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండడం లేదు. బయటి మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు.
ఏడు నెలలుగా నిలిచిన పామోలిన్
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతి నెలా జిల్లాకు 9 లక్షలకు పైగా పామోలిన్ పాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్ర తిరేషన్‌కార్డుపై లీటర్ పామోలిన్ రూ.40కు ఇచ్చే వారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పామోలిన్ రూ.55 ఉంది. అదే విధంగా కంది పప్పుది అదే పరిస్థితి. జిల్లాకు ప్రతి నెలా సుమారు 9 లక్షల కందిపప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా గత 5 నెలలుగా నిలిచిపోయాయి.కందిపప్పు రేషన్ దుకాణాల్లో కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్‌లో రూ. 80కి విక్రయిస్తున్నారు.
చేదెక్కిన చక్కెర
గత నెల వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ 30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగల నేపథ్యంలో చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చక్కెర ధరను అమాంతం పెంచేశారు. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్‌షాపులో కిలో రూ.13.50లకు లభించే చక్కెర కాస్తా బహిరంగ మార్కెట్‌లో రూ.34కి చేరడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.
పండగ పూట ఎండిల్లేనా?
Published Mon, Sep 29 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement