Pamolin
-
పేదల నోట్లో మట్టి !
అందని అమ్మహస్తం పామోలిన్, గోధుమల నిలిపివేత మార్కెట్లో నింగినంటిన ధరలు వినియోగదారులపై నెలకు *12.54 కోట్ల భారం చిత్తూరు: అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారులకు పామోలిన్, గోధుమలు,కందిపప్పు తదితర వస్తువులను నిలిపేసింది. పేద ప్రజలు బయట దుకాణాల్లో సరుకులు కొనాల్సివస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇది పేదలకు భారంగా మారింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న అరకొర సరుకుల్లో కూడా అధిక భాగం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు జిల్లాలో 10 లక్షల 37 వేల రేషన్ కార్డులు ఉండగా, ఆధార్ సీడింగ్ అంటూ కోతలు పెట్టి 9.65 లక్షల కార్డులను తేల్చారు. 72 వేల కార్డులను తొలగించారు. అర్హులైన పేదలు సైతం కార్డులు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్న కార్డులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యం, చక్కెర, పామోలిన్, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు, చింతపండు అంటూ 9 రకాల వస్తువుల పేర్లు చెప్పి తొలుత ఆర్భాటం చేసినా ఆ తరువాత కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వస్తువులను కూడా పంపిణీ చేయడంలేదు. బియ్యం,కిరోసిన్, ఒక్కో కార్డుకు అర కిలో చక్కెర మాత్రమే అందిస్తోంది. గోధుమలు,పామోలిన్, కందిపప్పు, చింతపండు పంపిణీ నిలిపేసింది. కందిపప్పు, పామోలిన్‌ను ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించేది, వీటి ధరలు మార్కెట్లో ఆకాశాన్నంటాయి. పేదలు కొనలేని పరిస్థితి. మార్కెట్లో కిలో చక్కెర *34 ఉండగా,కందిపప్పు * 80,గోధుమలు *36,పామోలిన్ కిలో పాకెట్ ధర * 54 ఉంది. ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంటే పేదలకు కొంతైనా ఉపశమనం ఉంటుంది. గతంలో ఇస్తున్న మేర అయినా సరుకులు పంపిణీచేస్తే వినియోగదారులపైన కోట్లాది రూపాయల భారం తగ్గేది. పౌరసరఫరాల శాఖ గణాంకాల మేరకు 9.65 లక్షల కార్డుదారులు నెలకు కిలో గోధుమలు బయట మార్కెట్లో కొనడంవల్ల జిల్లా వ్యాప్తంగా * 3,47,40,000 భారం పడుతుంది. ఇక పామోలిన్ పాకెట్‌పై *5,21,10,000 భారం పడుతుండగా, అర కిలో కందిపప్పు బయట మార్కెట్లో కొనడం వల్ల *3,86,00.000 భారం పడుతోంది. ఈ లెక్కన చూసినా నెలకు * 12 కోట్ల, 54 లక్షల, 50 వేలు వినియోగ దారులపై భారం పడుతోంది. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సరుకులు సక్రమంగా వినియోగదారులకు అందడంలేదు. రేషన్‌షాపుల డీలర్లు, అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కందిపప్పు,గోధుమలు,పామోలిన్‌తో పాటు మరిన్ని సరుకులు పంపిణీచేసి పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. -
పండగ పూట ఎండిల్లేనా?
భువనగిరి : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఉప్పు పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. 9 సరుకులు జాడే లేదు 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9,333 ఉండగా వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తె ల్ల రేషన్‌కార్డులపై 9 రకాల సరుకులను రూ.185కే అందించడానికి ‘అమ్మహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం 9 సరుకులకు గాను కేవలం బియ్యం, అడపాదడపా చక్కర మాత్రమే ఇస్తుండటంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అతిపెద్ద పండగలైన బతుకమ్మ, దసరాకు ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండడం లేదు. బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఏడు నెలలుగా నిలిచిన పామోలిన్ రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతి నెలా జిల్లాకు 9 లక్షలకు పైగా పామోలిన్ పాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్ర తిరేషన్కార్డుపై లీటర్ పామోలిన్ రూ.40కు ఇచ్చే వారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పామోలిన్ రూ.55 ఉంది. అదే విధంగా కంది పప్పుది అదే పరిస్థితి. జిల్లాకు ప్రతి నెలా సుమారు 9 లక్షల కందిపప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా గత 5 నెలలుగా నిలిచిపోయాయి.కందిపప్పు రేషన్ దుకాణాల్లో కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్లో రూ. 80కి విక్రయిస్తున్నారు. చేదెక్కిన చక్కెర గత నెల వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ 30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగల నేపథ్యంలో చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చక్కెర ధరను అమాంతం పెంచేశారు. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్‌షాపులో కిలో రూ.13.50లకు లభించే చక్కెర కాస్తా బహిరంగ మార్కెట్లో రూ.34కి చేరడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
పామోనిల్
- ఆరు నెలలుగా అందని పామోలిన్ - ఇక సరఫరా కష్టమేఅంటున్న అధికారులు - పౌర సరఫరాలలో ప్రతిసారీ ఇదే తంతు సాక్షి, కడప: బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. రుణాల మాఫీ నుంచి నిత్యావసర సరుకుల వరకు సక్రమంగా అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండటాన్ని చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సబ్సిడీ రేట్ల దృష్ట్యా పంపిణీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితిని పరిశీలిస్తే పామోలిన్ సరుకుల జాబితా నుంచి తొలగిస్తారని సంబంధిత శాఖ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆరు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : అంతకుముందు రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కలుపుకొని దాదాపు ఆరు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా పామోలిన్ ఆయిల్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం ఆరు నెలలుగా మండలాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పండుగలు వచ్చినా సరుకు పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ప్రతి వంటలోనూ నూనె వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్ సరఫరా చేయకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చౌక వస్తువుల్లోనూ కోత: జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా 7,48,575 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులు ప్రస్తుతం కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర మాత్రమే అన్ని గోడౌన్లకు పంపి రేషన్షాపులన్నింటికీ అందించారు. అయితే గోధుమపిండి మాత్రం కడప, చెన్నూరు, ఎర్రగుంట్ల, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్ధవటం, పోరుమామిళ్ళ, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లికి మాత్రమే అందించగా మిగతా ప్రాంతాలకు గోధుమపిండి కొరత ఏర్పడింది. కందిబేడలకు సంబంధించి కూడా జిల్లాలోని చెన్నూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్నమండెం, ముద్దనూరు, పులివెందుల సెంటర్లకు మాత్రమే పంపించారు. సరుకు ఉన్న మేరకు మాత్రమే పంపండంతో చాలా మండలాలకు కందిపప్పు ప్రస్తుతానికి అందేటట్లు కనిపించడం లేదు. గోధుమలు కూడా కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో మాత్రమే సరఫరా చేశారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 వస్తువులను సరఫరా చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారికి మాత్రం ఒక్క బియ్యం, చక్కెర పూర్తిగా అన్ని రేషన్‌షాపులకు అందిస్తుండగా మిగతా వస్తువులను మాత్రం పూర్తిస్థాయిలో కోత విధించారు. పౌర సరఫరాల శాఖ డీఎం ఏమంటున్నారంటే ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయంలో కోత పెడుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకుపోగా.. ప్రస్తుతానికి పామోలిన్ రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమేనని.. పామోలిన్‌ను రేషన్ సరుకుల జాబితా నుంచి తొలగించే అవకాశముందన్నారు. ఈసారి బియ్యం, చక్కెరతోపాటు కొంతమేర స్టాక్ ఉన్న కందిబేడలు, గోధుమపిండి, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.