పామోనిల్
- ఆరు నెలలుగా అందని పామోలిన్
- ఇక సరఫరా కష్టమేఅంటున్న అధికారులు
- పౌర సరఫరాలలో ప్రతిసారీ ఇదే తంతు
సాక్షి, కడప: బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. రుణాల మాఫీ నుంచి నిత్యావసర సరుకుల వరకు సక్రమంగా అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండటాన్ని చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సబ్సిడీ రేట్ల దృష్ట్యా పంపిణీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితిని పరిశీలిస్తే పామోలిన్ సరుకుల జాబితా నుంచి తొలగిస్తారని సంబంధిత శాఖ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆరు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ :
అంతకుముందు రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కలుపుకొని దాదాపు ఆరు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా పామోలిన్ ఆయిల్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం ఆరు నెలలుగా మండలాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పండుగలు వచ్చినా సరుకు పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ప్రతి వంటలోనూ నూనె వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్ సరఫరా చేయకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చౌక వస్తువుల్లోనూ కోత:
జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా 7,48,575 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులు ప్రస్తుతం కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర మాత్రమే అన్ని గోడౌన్లకు పంపి రేషన్‌షాపులన్నింటికీ అందించారు. అయితే గోధుమపిండి మాత్రం కడప, చెన్నూరు, ఎర్రగుంట్ల, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్ధవటం, పోరుమామిళ్ళ, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లికి మాత్రమే అందించగా మిగతా ప్రాంతాలకు గోధుమపిండి కొరత ఏర్పడింది.
కందిబేడలకు సంబంధించి కూడా జిల్లాలోని చెన్నూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్నమండెం, ముద్దనూరు, పులివెందుల సెంటర్లకు మాత్రమే పంపించారు. సరుకు ఉన్న మేరకు మాత్రమే పంపండంతో చాలా మండలాలకు కందిపప్పు ప్రస్తుతానికి అందేటట్లు కనిపించడం లేదు. గోధుమలు కూడా కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో మాత్రమే సరఫరా చేశారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 వస్తువులను సరఫరా చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారికి మాత్రం ఒక్క బియ్యం, చక్కెర పూర్తిగా అన్ని రేషన్‌షాపులకు అందిస్తుండగా మిగతా వస్తువులను మాత్రం పూర్తిస్థాయిలో కోత విధించారు.
పౌర సరఫరాల శాఖ డీఎం ఏమంటున్నారంటే
ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయంలో కోత పెడుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకుపోగా.. ప్రస్తుతానికి పామోలిన్ రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమేనని.. పామోలిన్‌ను రేషన్ సరుకుల జాబితా నుంచి తొలగించే అవకాశముందన్నారు. ఈసారి బియ్యం, చక్కెరతోపాటు కొంతమేర స్టాక్ ఉన్న కందిబేడలు, గోధుమపిండి, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.