నిత్యావసర మార్కెట్లోకి మార్క్‌ఫెడ్‌! | Markfed into essentials market in Telangana | Sakshi
Sakshi News home page

నిత్యావసర మార్కెట్లోకి మార్క్‌ఫెడ్‌!

Published Wed, Mar 15 2023 3:33 AM | Last Updated on Wed, Mar 15 2023 7:34 AM

Markfed into essentials market in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పుల్లో కూరుకుపోయిన మార్క్‌ఫెడ్‌ నిత్యావసర సరుకుల మార్కెట్లోకి అడుగుపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ఉనికిని కాపాడుకోవాలని, సంస్థను లాభాల బాట పట్టించాలని యోచిస్తోంది. అందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. అలాగే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసింది. 

ఆదాయం తగ్గి.. నష్టాలు పెరిగి.. 
వాస్తవానికి మార్క్‌ఫెడ్‌ రైతుల నుంచి మొక్కజొన్న, కంది, పెసర, శనగ తదితర పంటలను కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేయడం ద్వారా కమీషన్‌ వస్తుంది. అలాగే యూరియా, డీఏపీ వంటి ఎరువులనూ రైతులకు విక్రయిస్తుంది. ఇలా రెండు మార్గాల్లో వచ్చే కమీషనే దీనికి ప్రధాన ఆదాయ వనరు. అయితే కొన్నేళ్లుగా పంటలు మద్దతు ధర కంటే ఎక్కువే పలుకుతుండటంతో మార్క్‌ఫెడ్‌కు ప్రధాన పంటలను కొనే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆదాయ వనరులు తగ్గాయి.

మరోవైపు గతంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న వంటి పంటలను తిరిగి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మడంతో నష్టాలు  మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికితోడు 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు పేరుకుపోయాయి. దీంతో సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా లాభాలబాట పట్టాలని సంస్థ భావిస్తోంది. 

మార్క్‌ఫెడ్‌ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. 
► వంట నూనెలు, అన్ని రకాల బియ్యం, డ్రైఫ్రూట్స్, పప్పులు, గోధుమ పిండి, పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల నిత్యావసరాలను ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, కాలేజీలు, మహిళా శిశుసంక్షేమ, క్రీడ, వైద్య ఆరోగ్య, జైళ్లకు సరఫరా (నాణ్యమైన నిత్యావసరాలను టెండర్ల ద్వారా సేకరించి విక్రయించడం ద్వారా రెండు శాతం కమీషన్‌ పొందాలని మార్క్‌ఫెడ్‌ యోచన) 

► చిన్న, మధ్యస్థాయి శుద్ది కర్మాగారాల ఏర్పాటు. ప్రధానంగా పసుపు, పప్పు నూర్పిడి, చిల్లీ శుద్ధి ప్లాంట్లు. 
► పురుగుమందులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్స్‌ విక్రయాలు. 
► పైలట్‌ ప్రాజెక్టుగా ఒకట్రెండు జిల్లాల్లో సేకరణ. 

► వర్మీ కంపోస్టు విక్రయించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 
► సేంద్రియ తేనె, మామిడి పండ్ల విక్రయంపై దృష్టి. 
► పసుపు, మిరప పౌడర్‌ను వినియోగదారులకు అందజేయడం.  
► కేంద్రం ప్రవేశపెట్టిన శ్రీ అన్న పథకం సాయంతో మిల్లెట్ల మార్కెటింగ్‌. 

► ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటుæ భాగస్వామ్యం (పీపీపీ)తో మార్క్‌ఫెడ్‌ స్థలాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం.

► ఆదిలాబాద్‌లో 10 వేల మెట్రిక్‌ టన్నులు, నిర్మల్‌లో 20 వేల మెట్రిక్‌ టన్నులు, కొత్తగూడెం జిల్లాలో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాముల నిర్మాణం. 

► బ్యాంకు రుణాలతో మిర్యాలగూడ, నిర్మల్‌లలో రైస్‌ ఫోర్టిఫికేషన్‌ ప్రాజెక్టులు, తాగునీటి ట్రీట్మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement