సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్‌ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్‌ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది.
చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు
రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్‌లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు.
ఉత్పత్తులకు రంగులు
సీఎం యాప్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్‌పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
నాణ్యతను ట్రాక్ చేయవచ్చు...
కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్‌గా 2 లేదా 3 బ్యాగ్‌లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్‌తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్‌లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం.
ఫార్మర్ ఆప్షన్‌తో ధరల వివరాలు
సీఎం యాప్‌లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్‌ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్‌ని అప్‌గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్‌ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను కూడా తీసుకొచ్చారు.
రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు
సీఎం యాప్‌లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్‌లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్‌లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment