
తెనాలి: జర్మనీ ప్రభుత్వ సహకారంతో వచ్చే ఏడాది రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఇండో–జర్మన్ గ్లోబల్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రకృతి వ్యవసాయం చేసే 10 వేల రైతులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది, ప్రతి ఆర్‌బీకేలోనూ ఒక శాస్త్రవేత్త పనిచేసేలా చూడాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వం తరఫున లక్ష మంది విద్యావంతులైన ప్రకృతి రైతులకు శిక్షణ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఇందుకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా కొల్లిపర మండలం అత్తోట గ్రామాన్ని ఎంచుకున్నారు. గ్రామం వెలుపల ఆశ్రమంలో బుధవారం ఏర్పాటైన తరగతుల్లో తెనాలి ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 మంది విద్యావంతులైన యువ రైతులు పాల్గొన్నారు. వీరికి ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఫార్మర్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్.. అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
అనంతరం విజయకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వైవిధ్యమైన పంటలతో భూమిని 365 రోజులూ కప్పి ఉంచేలా తగిన ప్రణాళికతో ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. దీనివల్ల పోషక విలువలు కలిగిన ఆహార పంటలు వస్తాయనీ, అధిక దిగుబడులతో పాటు ఆదాయమూ పెరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో 1.40 కోట్ల ఉద్యోగాలుంటే, ఆటోమొబైల్ పరిశ్రమల్లో 1.20 కోట్ల ఉద్యోగాలే ఉన్నాయని, వ్యవసాయరంగంలో 150 కోట్ల ఉద్యోగాలున్నట్టు విజయ్‌కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment