సాక్షి, అమరావతి: సాధ్యమైనంత ఎక్కువమందికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద విడతకు రూ.2 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం జమచేస్తోంది.
పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతోపాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే.. వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12.98 లక్షలమందికి పీఎం కిసాన్ సాయం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 48.43 లక్షలమంది ఉన్నారు. వీరిలో ఈ–కేవైసీ పూర్తయిన 35.45 లక్షలమంది రైతులు మాత్రమే పీఎం కిసాన్‌కు అర్హత పొందారు. మిగిలినవారికి ఈ నెల 15వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తిచేసి నూరుశాతం మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాన సమస్యలు ఇవే..
ప్రధానంగా లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారు ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్, ఎన్‌పీసీఐ పోర్టల్‌లో మ్యాపింగ్ కాకపోవడం, ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండడం, ఆధార్ అప్‌డేట్ చేయడం వలన అనుసంధాన సమయంలో విఫలం కావడం, ఆర్టీజీఎస్, ఎన్‌ఐసీ సమస్యలు, అకౌంట్ బ్లాక్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా నమోదు కావడం, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలుండడం, చనిపోవడం వంటి వివిధ కారణాలతో వీరంతా ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర వెబ్‌ల్యాండ్ మ్యాపింగ్, ఈ–కేవైసీ పూర్తిగాకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది.
ఆర్బీకే స్థాయిలో అర్హుల గుర్తింపు
పెండింగ్ దరఖాస్తుల డేటాను ప్రభుత్వం మండల వ్యవసాయాధికారులతో పాటు రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడతారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్ పోర్టల్‌లో తగిన వివరాలను అప్‌లోడ్ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పోర్టల్‌తో మ్యాపింగ్ చేయించనున్నారు.
తొలుత డిసెంబర్ నెలాఖరువరకు గడువునిచ్చిన కేంద్రం.. రాష్ట్రప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. గడువులోగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని రైతులను ఆర్బీకే స్థాయిలో గుర్తించి వారితో దగ్గరుండి ఈ–కేవైసీ చేయించాలని సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోగా మిగిలిన రైతులందరితో ఈ–కేవైసీ చేయించడంతోపాటు ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment